అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri Narasimha Temple | పచ్చని చెట్లు.. ఎత్తైన నల్లని రాతికొండలు.. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణం.. పక్షుల కిలకిలరావాల మధ్య సహజసిద్ధమైన గుహలో కొలువుదీరిన లక్ష్మీనరసింహుడి దివ్యమంగళ రూపం.. భక్తుల పాలిట కొంగుబంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతున్న నింబాచల (లింబాద్రి) క్షేత్రం కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Limbadri Narasimha Temple | భీమ్‌గల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్లు..
నిజామాబాద్ జిల్లా (Nizamabad District) భీమ్‌గల్ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ఈ నెల 15 నుంచి 26 వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరానున్నారు.
Limbadri Narasimha Temple | రెండు అంతస్తుల కొండ.. గుహలో స్వామివారు
లింబాద్రిగుట్ట క్షేత్ర నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రెండు అంతస్తులుగా కనిపించే కొండపై స్వామివారు కొలువుదీరారు. మొదటి అంతస్తులో స్వామివారి మాడవీధులు, కమలా పుష్కరిణి, కల్యాణ మండపం, రథం గుడి, అయోధ్య ఆంజనేయస్వామి ఆలయం ఉన్నాయి. రెండో అంతస్తులో సహజసిద్ధంగా ఏర్పడిన లోతైన రాతి గుహలో స్వామివారి మూలవిరాట్టు దర్శనమిస్తుంది. సుమారు 250 మీటర్ల పొడవైన ఇరుకైన గుహమార్గంలో భక్తులు వంగి నడుచుకుంటూ గర్భాలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. గుహ ప్రవేశద్వారం వద్ద జోడు లింగాలు దర్శనమిస్తాయి.
Limbadri Narasimha Temple | శాంత స్వరూపుడిగా లక్ష్మీనరసింహుడు
సాధారణంగా నరసింహస్వామి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంటారు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం తన తొడపై లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుని శాంత స్వరూపుడిగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. గర్భాలయంలో స్వామివారితో పాటు నరనారాయణుల విగ్రహాలు కొలువుదీరడం మరో విశేషం. ఈ ప్రత్యేకత కారణంగానే లింబాద్రిగుట్టను దక్షిణ బద్రీనాథ్‌గా భక్తులు పిలుచుకుంటారు.
Limbadri Narasimha Temple | బ్రహ్మహత్యా దోష నివారణకు..
స్థలపురాణం ప్రకారం.. పార్వతీ పరమేశ్వరుల కల్యాణ సమయంలో బ్రహ్మదేవుడు పార్వతీదేవి పాదాలను చూడటంతో ఆగ్రహించిన పరమశివుడు తన గోటితో బ్రహ్మదేవుడి ఐదో శిరస్సును తొలగించినట్లు పురాణ గాథలు చెబుతాయి. బ్రహ్మహత్యా దోష నివారణ కోసం బ్రహ్మదేవుడు ఈ ప్రాంతంలో తపస్సు చేయగా, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమేత నరసింహుడిగా సాక్షాత్కరించినట్లు స్థలపురాణం వివరిస్తోంది.
Limbadri Narasimha Temple | జోడు లింగాలు.. శివకేశవుల అభేదతత్వానికి ప్రతీక
గుహ ప్రవేశద్వారం వద్ద కనిపించే జోడు లింగాలు ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకత. బ్రహ్మహత్యా దోష నివారణ కోసం పరమశివుడు ఇక్కడ తపస్సు చేసి, స్వామివారి అనుగ్రహంతో జోడు లింగాల రూపంలో వెలిశాడని భక్తుల విశ్వాసం. ఒకే క్షేత్రంలో శివకేశవుల ఆరాధనకు ప్రాధాన్యం ఉండటం విశేషం.
Limbadri Narasimha Temple | అయోధ్య ఆంజనేయుడు క్షేత్రపాలకుడు
శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు ఆచరించి, నరసింహ రూపంలో ఉన్న శ్రీరాముడిని దర్శించుకున్నట్లు స్థలపురాణం చెబుతోంది. అందుకు గుర్తుగా కొండ దిగువన అయోధ్య ఆంజనేయస్వామి ఆలయం వెలసింది. హనుమంతుడిని క్షేత్రపాలకుడిగా భక్తులు పూజిస్తారు.
Limbadri Narasimha Temple | కమలా పుష్కరిణికి ప్రత్యేకత
ఆలయ ప్రాంగణంలోని కమలా పుష్కరిణి భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ పుష్కరిణికి పురాణపరమైన ప్రాశస్త్యం ఉంది. సత్యహరిశ్చంద్రుడు, నరనారాయణులు, ధర్మరాజు, ప్రహ్లాదుడు తదితరులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారిని సేవించినట్లు స్థలపురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంద్రుడు కమలాలతో స్వామివారిని పూజించి శాపవిముక్తి పొందినట్లు కూడా చెబుతారు.
Limbadri Narasimha Temple | లింబయ్య.. నర్సయ్య పేర్లతో అనుబంధం
లింబాద్రి లక్ష్మీనరసింహస్వామిపై ఈ ప్రాంత ప్రజలకు అపారమైన భక్తిశ్రద్ధలు ఉన్నాయి. నిజామాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లోనూ లింబాద్రి, లింబన్న, లింబయ్య, నర్సింహులు, నర్సయ్య వంటి పేర్లు కలిగినవారు అధికంగా కనిపిస్తారు. తరతరాలుగా ఈ క్షేత్రంతో ప్రజలకు ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనం.
Limbadri Narasimha Temple | కార్తీక బ్రహ్మోత్సవాల సందడి
కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో 12 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ప్రత్యేక పూజలు, స్వామివారి కల్యాణోత్సవం, రథోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 15న మంగళహారతులు, బోనాలు, బాజాభజంత్రీల నడుమ స్వామివారు గుట్టపైకి వేంచేశారు. 17న ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగే మహారథోత్సవం ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నవంబర్ 17న దాతలు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం కల్పించనుండగా, 19, 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి తెలిపారు. సామాన్య భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని పేర్కొన్నారు.
Limbadri Narasimha Temple | క్షేత్రానికి చేరుకునే మార్గం
హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వరకు బస్సు సౌకర్యం ఉంది. నిజామాబాద్ నుంచి ఆర్మూర్ సుమారు 25 కిలోమీటర్లు, అక్కడి నుంచి భీమ్‌గల్ మరో 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమ్‌గల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో లింబాద్రిగుట్ట ఉంది. గుట్టకు చేరుకునేందుకు ఆటోలు, ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
ప్రకృతి సౌందర్యం.. పురాణ ప్రాశస్త్యం.. అరుదైన గుహాలయ నిర్మాణం.. లక్ష్మీ సమేతుడైన నరసింహుడి శాంత స్వరూప దర్శనం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతున్న నింబాచల క్షేత్రం కార్తీక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Farmers | ధాన్యం క్వింటాల్‌కు రూ.3,500 వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి