అక్షరటుడే వెబ్‌డెస్క్: Rapido Bike Taxi | కర్ణాటక బైక్ ట్యాక్సీ వ్యవహారంలో సుప్రీం కోర్టు ( Supreme Court ) వెలువరించిన తీర్పును ప్రముఖ మొబిలిటీ సంస్థ ర్యాపిడో (Roppen Transportation Services Pvt Ltd) స్వాగతించింది. బైక్ ట్యాక్సీ కేసులో కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను సుప్రీం కోర్టు కొట్టివేయడం దేశంలోని బైక్ ట్యాక్సీ రంగానికి ఒక చారిత్రక ఘట్టమని పేర్కొంది. ఈ నిర్ణయం లక్షలాది మంది ప్రయాణికులు, డ్రైవర్లకు (కెప్టెన్లకు) పెద్ద ఊరటనివ్వడమే కాకుండా, స్పష్టమైన, ఆచరణీయమైన బైక్ ట్యాక్సీ విధానాలను రూపొందించుకునేందుకు రాష్ట్రాలకు బలమైన పునాది వేస్తుందని సంస్థ అభిప్రాయపడింది.
Rapido Bike Taxi | బైక్ ట్యాక్సీ రంగంలో ముందడుగు..
గత కొన్నేళ్లుగా దేశంలో బైక్ ట్యాక్సీ వ్యవస్థను బలోపేతం చేయడంలో ర్యాపిడో కీలక పాత్ర పోషిస్తోంది. తక్కువ దూర ప్రయాణాలకు, ముఖ్యంగా తొలి, చివరి మైలు (ఫస్ట్, లాస్ట్ మైల్) ప్రయాణాలకు బైక్ ట్యాక్సీలు సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా నిలిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రయాణికులకు మరిన్ని రవాణా ఎంపికలు అందుబాటులోకి రావడంతో పాటు, లక్షలాది మందికి సౌకర్యవంతమైన ఉపాధి, ఆదాయ మార్గాలు లభిస్తున్నాయి.
Rapido Bike Taxi | పవన్ గుంటుపల్లి స్పందన..
సుప్రీం కోర్టు తీర్పుపై ర్యాపిడో సహ వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి స్పందిస్తూ.. ఇది కర్ణాటకలో బైక్ ట్యాక్సీ రంగానికి ఎంతో అవసరమైన స్పష్టతను తీసుకొచ్చిందని అన్నారు. రద్దీ నగరాల్లో ప్రయాణాలు సులభతరం చేయడం, కనెక్టివిటీని పెంచడం, డ్రైవర్లకు ఆదాయ అవకాశాలు కల్పించడం ద్వారా బైక్ ట్యాక్సీలు తమ ప్రాముఖ్యతను నిరూపించుకున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఈ రంగం పోషిస్తున్న పాత్రను ఈ తీర్పు గుర్తించిందని పేర్కొన్నారు.
Rapido Bike Taxi |ప్రజల ప్రయాణ అవసరాలకు ..
ఇది కేవలం న్యాయపరమైన విజయం మాత్రమే కాదని, ప్రజలు వాస్తవంగా ప్రయాణించే తీరుకు తగిన రవాణా పరిష్కారాలు అవసరమన్న తమ విశ్వాసాన్ని ఈ తీర్పు ధృవీకరించిందని పవన్ గుంటుపల్లి అన్నారు. దేశంలో అత్యధిక మంది వద్ద ద్విచక్ర వాహనాలు ఉన్నందున, వాటిని ఉత్పాదకంగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తే ప్రయాణికులకు, డ్రైవర్లకు, నగరాలకు మేలు జరుగుతుందని చెప్పారు. సురక్షితంగా, బాధ్యతాయుతంగా, నియంత్రిత పద్ధతిలో ఈ రంగాన్ని తదుపరి దశకు తీసుకెళ్లేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Rapido Bike Taxi | నగర రవాణాకు అనుబంధంగా ..
బెంగళూరు వంటి రద్దీ నగరాల్లో మెట్రో, బస్సులు, ఆటోలు, క్యాబ్‌లతో పోటీ పడకుండా వాటికి అనుబంధంగా బైక్ ట్యాక్సీలు పనిచేయగలవని సంస్థ తెలిపింది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ద్విచక్ర వాహనంతో ఆదాయం పొందే వీలుండటంతో డ్రైవర్లు సులభంగా ఈ రంగంలో భాగస్వాములవుతున్నారు. న్యాయపరమైన స్పష్టత వచ్చిన నేపథ్యంలో, తమ సాంకేతికత, నిర్వహణ నైపుణ్యం, భద్రతా ప్రమాణాలతో బైక్ ట్యాక్సీ రంగాన్ని మరింత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తామని ర్యాపిడో స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Vemulawada Development | వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్