Sabarimala Video Ban | అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమలలో ఈ తప్పు చేస్తే అరెస్టే..

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నిషేధిత ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sabarimala Video Ban | శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నిషేధిత ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. సన్నిధానంలోని అయ్యప్ప స్వామి, మలికప్పురమ్మ విగ్రహాలతో పాటు ఆలయ పరిసరాల్లో రహస్యంగా చిత్రీకరణ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని నిఘా విభాగం హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి వీడియోలు తీస్తే అరెస్టు చేయడంతో పాటు మొబైల్ ఫోన్లు, కెమెరాలను స్వాధీనం చేసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Sabarimala Video Ban |  ఉల్లంఘనలు..

శబరిమల సన్నిధానంలోని శ్రీకోవిల్‌లో ఉన్న అయ్యప్ప స్వామి, మలికప్పురత్తమ్మ విగ్రహాలను చిత్రీకరించడంపై పూర్తిగా నిషేధం ఉంది. అదేవిధంగా పతినెట్టంపడి (18 మెట్లు), మెల్తిరుముట్టం, మలికప్పురం ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీయకూడదని కేరళ ( Kerala ) హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కొందరు భక్తులు, యూట్యూబర్లు నిబంధనలను పట్టించుకోకుండా చిత్రీకరణకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Sabarimala Video Ban | జుట్టులో ఫోన్లు దాచి రికార్డింగ్..

దర్శనానికి వచ్చే కొంతమంది యూట్యూబర్లు భద్రతా సిబ్బంది కంట పడకుండా రహస్య పద్ధతుల్లో వీడియోలు తీస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మొబైల్ ఫోన్లలో ముందుగానే రికార్డింగ్ ఆన్ చేసి.. వాటిని చొక్కా జేబుల్లో లేదా జుట్టులో దాచిపెట్టి సన్నిధాన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఎడిట్ చేసి, అనుమతి ఉన్న ప్రాంతాల్లో తీసిన వీడియోలతో కలిపి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. మరికొందరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కేవలం వ్యూస్, లైకుల కోసం ఇలా చేయడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Sabarimala Video Ban | భద్రతాపరమైన ఆందోళనలు..

శబరిమల అత్యంత సున్నితమైన ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో అనధికారిక వీడియోల వల్ల భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని నిఘా విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సంఘవిద్రోహ, తీవ్రవాద శక్తులు ఈ దృశ్యాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనిపై దేవస్థానం విజిలెన్స్ బృందం ఇప్పటికే విచారణ జరిపి నివేదిక అందించింది. నిషేధిత ప్రాంతాల్లో వీడియోలు తీసేవారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసులు నిర్ణయించారు. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు ఆలయ నిబంధనలు పాటిస్తూ, నిషేధిత ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Peddamma Temple | ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *