అక్షరటుడే, కామారెడ్డి: Mystery Poster | కామారెడ్డిలో(Kamareddy) ఓ మిస్టరీ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పేరు లేదు, నాయకుడి ఫొటో లేదు, పార్టీ గుర్తు లేదు. కేవలం ఒక ప్రశ్న, రెండు క్యూఆర్ కోడ్లు మాత్రమే ఉన్న కరపత్రాలు గురువారం ఉదయం దినపత్రికల్లో పాంప్లెట్స్ మాదిరిగా ప్రజల ఇళ్లకు చేరాయి.
Mystery Poster | పాలకుడి ముఖం మారితే, అధికార స్వభావం మారుతుందా..
పోస్టర్‌పై పెద్ద అక్షరాలతో ‘పాలకుడి ముఖం మారితే, అధికార స్వభావం మారుతుందా?’ అని రాసి ఉంది. కింద సూటు వేసుకున్న వ్యక్తి పందిముఖంతో ఉన్న బొమ్మ ఉంది. పక్కనే ‘@SILENTPOLITICALPARTY’ పేరుతో రెండు క్యూఆర్ కోడ్లు ముద్రించారు. ఈ తరహా ప్రచారం చూసిన వెంటనే చాలా మందికి ఇటీవల ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ గుర్తుకు వచ్చింది. ఆ పార్టీ కూడా మొదట్లో ఎటువంటి నాయకుడి ముఖం లేకుండా, వ్యంగ్య పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారానే ప్రజల్లోకి వెళ్లింది. నేరుగా ఓట్లు అడగకుండా, వ్యవస్థపై ప్రశ్నలు వేస్తూ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సైలెంట్ పొలిటికల్ పార్టీ కూడా అదే మార్గంలో వెళ్తుందా అనే చర్చ మొదలైంది.
Mystery Poster | క్యూఆర్ స్కాన్ చేస్తే..
ఆసక్తిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వారికి ఇన్ స్టాగ్రామ్‌లో ‘silentpoliticalparty’ పేరుతో ఒక పేజీ కనిపిస్తోంది. పోస్టర్లో ఉన్న రెండు క్యూఆర్ కోడ్ లు కూడా ఇదే పేజీకి వెళ్తున్నాయి. ప్రస్తుతం ఆ పేజీకి 572 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతోంది. పేజీలో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అందులో తెలుగు వెర్షన్‌తో పాటు ఇంగ్లిష్‌లో “If the ruler’s face changes, Does the nature of power change?” అనే పోస్ట్ కూడా ఉంది. పేజీ బయోలో “Educate. Agitate. Organise. Liberty. Equality. Fraternity.” అని రాసి ఉంది. అదే పంది ముఖం బొమ్మను ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్నారు.
Mystery Poster | ఏ పార్టీ? ఎవరు నడుపుతున్నారు?
దీంతో ఇది ఏ పార్టీ ఇది? ఎవరు నడుపుతున్నారు? ఎన్నికల కోసమా? లేక సినిమా ప్రమోషనా? అంటూ కామారెడ్డిలో చర్చ మొదలైంది. టీ స్టాళ్ల దగ్గర, వాట్సాప్ గ్రూపుల్లో ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. “ముఖం మారినా వ్యవస్థ మారదు అనే అర్థంతో వేశారేమో” అని కొందరు, “కొత్త పార్టీ వస్తోందేమో” అని మరికొందరు అనుకుంటున్నారు. ఈ పోస్టర్ వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ మాదిరిగానే, ఎటువంటి పేరు లేకుండా కేవలం ఒక్క ప్రశ్నతోనే కామారెడ్డి మొత్తం తనవైపు తిప్పుకుందీ మిస్టరీ పోస్టర్.
ఇది కూడా చదవండి: యాక్టర్ సరా అర్జున్..న్యూ లుక్ వీడియో వైరల్