అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: SI Preliminary Exam | నగరంలో ఈనెల 29న జరగనున్న ఎస్సై ప్రాథమిక రాత పరీక్షను పక్కాగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
SI Preliminary Exam | నిజామాబాద్ నగరంలో 20 కేంద్రాలు..
నగరంలోని 20 పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ (పాత 144 సెక్షన్) ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) తెలిపారు. ఈనెల 29వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్సై (SI) ప్రాథమిక రాత పరీక్ష జరగనుందన్నారు. పరీక్షను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు నగరంలోని 20 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
SI Preliminary Exam | పరీక్ష కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిలో..
పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఇద్దరికంటే ఎక్కువ మంది గుమికూడటం నిషేధమని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఆదివారం ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ సౌండ్ సిస్టమ్స్ (లౌడ్ స్పీకర్లు) వినియోగించకూడదన్నారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసు అధికారులతో ప్రత్యేక బందోబస్తు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేశామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
SI Preliminary Exam | నగరంలోని 20 పరీక్షా కేంద్రాలు..
ఎస్ఆర్. జూనియర్ కళాశాల (గంగస్థాన్ ఫేజ్-1), ఎస్ఆర్. జూనియర్ కళాశాల (బ్యాంక్ కాలనీ, కంఠేశ్వర్), సీఎస్ఐ డిగ్రీ కళాశాల (కంఠేశ్వర్), సీఎస్ఐ జూనియర్ కళాశాల (కంఠేశ్వర్), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (కంఠేశ్వర్), నారాయణ జూనియర్ కళాశాల (సుభాష్‌నగర్), ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (నీలకంఠేశ్వర ఆలయ సమీపంలో), రవి ఉన్నత పాఠశాల, (సుభాష్‌నగర్), ఎస్ఎఫ్ఎస్ ఉన్నత పాఠశాల (సుభాష్‌నగర్), నారాయణ ఉన్నత పాఠశాల (సుభాష్‌నగర్), నిర్మల హృదయ ఉన్నత పాఠశాల (సుభాష్‌నగర్), నిర్మల హృదయ జూనియర్ కళాశాల (సుభాష్‌నగర్), వాసు ఉన్నత పాఠశాల (కేసీపీ మెట్రో వెనుక,దుబ్బ), వసుధ ఉన్నత పాఠశాల (కేసీపీ మెట్రో వెనుక, దుబ్బ), గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల – ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్ (దుబ్బ), గిరిరాజ్ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల – పీజీ బ్లాక్ (దుబ్బ), కేర్ డిగ్రీ కళాశాల (పాత తిలక్ గార్డెన్, బస్టాండ్ సమీపంలో), ఆదర్శ హిందీ మహావిద్యాలయ జూనియర్ కళాశాల (బస్టాండ్ సమీపం), ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల (రాజీవ్ గాంధీ ఆడిటోరియం సమీపం, ఖలీల్‌వాడి), నలంద మహిళా డిగ్రీ కళాశాల (రాజీవ్ గాంధీ ఆడిటోరియం, బస్టాండ్ సమీపంలో)లో పరీక్షలు జరుగనున్నాయి.
ఇది కూడా చదవండి..: Illegal Constructions | నందిపేట్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత..