అక్షరటుడే, ఆర్మూర్: Armoor Tension | ఆర్మూర్ (Armoor)లో సోమవారం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ సవాళ్లు.. ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. బీఎన్ఎస్ 163ని ప్రయోగించింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పొద్దుటూరి వినయ్‌కుమార్‌లను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అంకాపూర్‌లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు పలువురు కాంగ్రెస్ నాయకులు యత్నించగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘చలో అంకాపూర్’కు పిలుపునివ్వడం.. తాము సైతం బలం ప్రదర్శిస్తామని బీజేపీ నాయకులు పేర్కొనడంతో రెండురోజులుగా ఆర్మూర్ పట్టణంలో పరిస్థితి హాట్‌హాట్‌గా మారింది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. సోమవారం కాంగ్రెస్ ఆర్మూర్ నియోజక వర్గం వినయ్ కుమార్ రెడ్డిని పీవీఆర్ భవన్లో పోలీసులు ఉదయాన్నే హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్లోని తన నివాసంలో బీజేపీ నాయకులతో ఉదయాన్నే సమావేశం కాగా పోలీసులు ఆయనను సైతం హౌస్ అరెస్ట్ చేశారు.
Armoor Tension | బీజేపీ, కాంగ్రెస్ నేతల అరెస్ట్..
అంకాపూర్‌లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి మద్దతుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్మూర్‌కు బయలుదేరగా ఆయనను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఆయా మండలాల పోలీస్స్టేషన్లకు తరలించారు. మరోవైపు రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో అంకాపూర్‌లో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
Armoor Tension | కాంగ్రెస్ నాయకుల మెడలోని బంగారు గొలుసులు లాక్కోండి..
కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఆ పార్టీ నేతల మెడలలోని బంగారు గొలుసులు లాక్కోవాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయంలో మహిళలకు తాను అండగా ఉంటానన్నారు. మహిళలు ధైర్యంగా ఆ బంగారు గొలుసులు అమ్మేసి తనకు రిసిప్ట్ పెట్టాలని సూచించారు. స్కూటీలు ఇస్తామని సైతం హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ నాయకుల షోరూంలో నుంచి స్కూటీలు సైతం ఎత్తుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింపుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి రాకేష్ రెడ్డి మద్దతుగా అంకాపూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో చర్చకు రాకేష్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు. ఆర్మూర్, ఇందూర్ అభివృద్ధి ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు.
Armoor Tension | సొంత ఊరులోనే సర్పంచ్‌ను గెలిపించుకోలేకపోయాడు..
అంకాపూర్ గ్రామంలోనే సర్పంచ్ గెలిపించుకోలేని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తరచూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లకు తరచూ సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 15న నిజామాబాద్‌లో బీజేపీ రణభేరిలో కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలే ‘చలో అంకాపూర్’ పిలుపునకు దారితీసిందన్నారు. పీసీసీ చీఫ్‌ను రాజీనామా చేసి పోటీ చేయాలని పిలిచే అవసరం లేదని.. ఇక్కడ పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని వినయ్ రెడ్డి అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 86 గ్రామ పంచాయతీలకు బీజేపీ 11 సర్పంచ్ స్థానాలు గెలిస్తే 66 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు.
Armoor Tension | పోలీసుల ఆధీనంలో అంకాపూర్..
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నిర్ణయించడంతో పోలీసులు అంకాపూర్‌ను చుట్టుముట్టారు. అన్ని దారులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంకాపూర్లోకి వచ్చీవెళ్లే ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు బీఎన్ఎస్ 163 అమల్లో ఉన్నందున పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ముట్టడికి యత్నించిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Police | వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీసులు