అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Bus Stand Theft Gang | బస్టాండ్‌లో రద్దీని ఆసరాగా చేసుకుని.. వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తారు.. అనంతరం గప్‌చుప్‌గా బంగారం చోరీ చేసి మాయమవుతారు.. ఆయా జిల్లాల్లో(Nizamabad Police) వరుస చోరీలకు పాల్పడుతున్న కుటుంబ సభ్యులతో కూడిన అంతర్జిల్లా ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఏసీపీ ప్రకాశ్ యాదవ్ వివరాలు వెల్లడించారు.
ఆరుగురు కుటుంబ సభ్యులో కూడిన ఓ ముఠా చోరీలనే వృత్తిగా ఎంచుకుంది. ఇందులో భాగంగా ఖతీజా బేగం (67) తన కుటుంబసభ్యులు నజ్మా బేగం, షేక్ అన్జద్, తహేరా, అబ్దుల్ జుబైర్, షేక్ వసీం అహ్మద్‌లతో ముఠాగా ఏర్పడ్డారు. వీరు బస్టాండ్లలో రద్దీగా ఉండే సమయాల్లో, బస్సులు ఎక్కే వయసు పైబడిన మహిళలను లక్ష్యంగా చేసుకుని.. వారి మెడల్లోని బంగారు గొలుసులు కత్తిరించడం, బ్యాగుల నుండి నగదు, నగలు దొంగిలించడం చేసేవారు. తాజాగా గతనెల 17న నవీపేట్ బస్టాండ్‌లో వంకర విజయలక్ష్మి (76) అనే వృద్ధురాలు బస్సు ఎక్కుతుండగా.. ఆమె మెడలోని బంగారు గుండ్ల తాడును కత్తిరించి ఎర్టిగా కారులో భైంసాకు పరారయ్యారు.
Bus Stand Theft Gang | నవీపేట్ పోలీసుల ఆధ్వర్యంలో..
ఈ ముఠా దొంగిలించిన సొత్తును విక్రయించే క్రమంలో నిజామాబాద్ వస్తుండగా.. నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు. గతంలో నిజామాబాద్(Nizamabad), నందిపేట(Nandipet) బస్టాండ్లలో కూడా బంగారు గాజులు, నెక్లెస్, పుస్తెలతాడులను దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠాపై నవీపేట్, నిజామాబాద్ టౌన్-1, నందిపేట పోలీస్ స్టేషన్లలో మొత్తం 5 కేసులు (2025, 2026 లలో) నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి రూ.10లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఎర్టీగా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై గఫార్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుళ్లు రాజారెడ్డి, రాకేశ్, సర్దార్ సింగ్, శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేగౌడ్, సీడీఆర్ సెల్ టీం (సాగర్, శ్రీనివాస్, సందీప్, నాగరాజు, రాకేశ్, లలిత, ప్రవళిక) ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ముఠాను పట్టుకున్న పోలీసులను సీపీ సాయిచైతన్య అభినందించారు.