అక్షరటుడే, కామారెడ్డి : Madnoor police | డబ్బు సంపాదించాలనే దురాశతో ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అయితే ఆ కుటుంబానికి పరిచయస్తుడే ఈ కిడ్నాప్‌కు పాల్పడడంతో బాధితులు నివ్వెరపోయారు. ఈ కేసును మద్నూర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించి బాలికను క్షేమంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Madnoor police | మద్నూర్ మండల కేంద్రంలో..
మద్నూర్ మండలంలో జరిగిన ఈ ఘటనపై ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ (Nizamabad) వెళ్లిన బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో బాన్సువాడ డీఎస్పీ పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సీసీటీవీ పుటేజ్, సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారంతో నిందితుడి ఆచూకీని గుర్తించారు. నిందితుడు హర్నే రాజేందర్ తాడిహిప్పర్గ గ్రామానికి చెందినవాడిగా కనుగొన్నారు.
బాలికను ఆటోలో దెగ్లూర్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి నాందేడ్, ఔరంగాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించాడు. దెగ్లూర్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని బాలికను రక్షించారు. నిందితుడి నుంచి రైలు టికెట్, బాలిక దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చిన్నారుల భద్రత విషయంలో జీరో టాలరెన్స్ ఉంటుందని, కేసును వేగంగా ఛేదించిన బృందాన్ని అభినందించారు. పిల్లలను అపరిచితుల వద్ద ఒంటరిగా వదలొద్దని, అనుమానం వస్తే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇది కూడా చదవండి : #WATCH | మహారాష్ట్రలోని బిర్వాడిలో మొసలి రోడ్డుపైకి వచ్చింది.