Bandi Sanjay Son Posters | ‘పోస్టర్’ రోగం.. తెలంగాణలో కొత్త రాజకీయం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Sanjay Son Posters | రాజకీయం అంటేనే విమర్శలు, ప్రతివిమర్శలు.. కానీ, ఇప్పుడు ఆ విమర్శలు మైకుల నుంచి నేరుగా మున్సిపల్ గోడలకు, విగ్రహాల గద్దెలకు పాకాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తా ఇప్పుడు ఒక కొత్త ‘వాల్ పోస్టర్’ యుద్ధానికి వేదికైంది. కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోస్టర్లు రాత్రికి రాత్రే వెలియడం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది.

Bandi Sanjay Son Posters | విగ్రహాల సాక్షిగా..

దేశం గర్వించదగ్గ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ విగ్రహం సాక్షిగా, ఎవరో ‘అజ్ఞాత వ్యక్తులు’ ఈ పోస్టర్లు అతికించారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పొక్సో (POCSO) కేసు అంశాన్ని అస్త్రంగా చేసుకుని, అతన్ని టార్గెట్ చేస్తూ ఈ పోస్టర్లు దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది.

“తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, కానీ ఇలా గోడలకు పోస్టర్లు అంటించి ‘వీధి తీర్పులు’ చెప్పడం ఏ సంస్కృతికి నిదర్శనం?” అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Bandi Sanjay Son Posters | వ్యవస్థకు ముప్పా?

తెలంగాణ రాజకీయాల్లో కేసు నమోదు కాగానే ఇలా పోస్టర్లు వేయడం ఒక కొత్త ‘ట్రెండ్’ గా మారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే కొన్ని ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

కేసు కోర్టులో ఉండగానే, రోడ్లపై ఇలాంటి ప్రచారాలు జరిగితే పోలీసుల దర్యాప్తునకు విలువ ఎక్కడుంటుందంటున్నారు. ప్రజల్లో చట్టం పట్ల నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

అరాచకానికి బాటలు: రేపు ఎవరికి నచ్చని వారు ఎదురైనా, వెంటనే పోస్టర్లు వేసి బజారున పడేసే అరాచక సంస్కృతికి ఇది పునాది వేసే ప్రమాదముందంటున్నారు.

Bandi Sanjay Son Posters | ఖాకీల స్పందన ఏది?

నగర నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి పోస్టర్లు వెలుస్తుంటే నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈ ‘పోస్టర్ గ్యాంగ్’ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? రాజకీయంగా ఎవరిని దెబ్బకొట్టడానికి ఈ ఎత్తుగడ వేశారు? అన్నది తేలాల్సి ఉంది.

రాజకీయాల్లో విమర్శలు పదునుగా ఉండాలి కానీ, అవి వ్యక్తిగత దూషణలకు, బహిరంగ అవమానాలకు వేదికలు కాకూడదు. మరి ఈ పోస్టర్ల వ్యవహారంపై నిజామాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతారా.. లేక ‘చూసీ చూడనట్లు’ వదిలేస్తారా.. అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, గోడలకు పట్టిన ఈ ‘పోస్టర్ రోగం’ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమకరం కాదనేది విశ్లేషకుల మాట.

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *