అక్షరటుడే వెబ్‌డెస్క్: Ghaziabad Lead Poisoning Case | కోట్ల రూపాయల ఆస్తి, ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య వేసిన దారుణమైన కుట్ర ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో బయటపడింది. భర్త, కొడుకుతో పాటు మేనల్లుడి ఆహారంలో కూడా సీసం ( Lead ) కలిపి స్లో పాయిజన్ ఇస్తున్న భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఘాజియాబాద్‌లోని వసుంధర ప్రాంతానికి చెందిన సుశీల్ కుమార్ భట్నాగర్‌కు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల విలువైన ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారంతో పాటు రూ.2 కోట్ల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. భర్త మరణిస్తే నామినీగా ఉన్న తనకే ఇన్సూరెన్స్ డబ్బు, వ్యాపారం దక్కుతాయని భార్య రేణు భట్నాగర్ పథకం పన్నింది.
Ghaziabad Lead Poisoning Case | స్లో పాయిజన్‌తో అనారోగ్యం..
ఎవరికీ అనుమానం రాకుండా రోజువారీ ఆహారంలో విషపూరితమైన లెడ్ కలపడం రేణు మొదలుపెట్టింది. ఆస్తికి అడ్డు రాకూడదనే ఉద్దేశంతో భర్తతో పాటు కన్నకొడుకు, మేనల్లుడి ఆహారంలోనూ సీసం కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి విషపూరిత ఆహారం తీసుకోవడంతో ముగ్గురూ తరచూ అస్వస్థతకు గురయ్యారు. ఎంత చికిత్స చేసినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అనుమానం వచ్చిన సుశీల్ పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించారు. శరీరంలో ప్రమాదకర స్థాయిలో లెడ్ ఉన్నట్లు రిపోర్టుల్లో తేలడంతో, ఇది తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల పనేనని గుర్తించి సెప్టెంబర్ 24, 2026న ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Ghaziabad Lead Poisoning Case | విచారణ తర్వాత అరెస్టు..
ఈ ఫిర్యాదుపై రెండు నెలల పాటు దర్యాప్తు చేసిన పోలీసులు నవంబర్ 23న రేణు భట్నాగర్‌ను అరెస్టు చేశారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. డబ్బు ఆశతోనే భర్త, కొడుకు, మేనల్లుడి ఆహారంలో లెడ్ కలిపినట్లు ఒప్పుకుందని వెల్లడించారు. ఈ కుట్రలో ఆమె కుటుంబ సభ్యుల ప్రమేయంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Peddamma Temple | ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు