అక్షరటుడే వెబ్‌డెస్క్: Train Fire Safety | రైలు ప్రయాణాల సమయంలో కొందరు ప్రయాణికుల వింత చర్యలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా కదులుతున్న ఏసీ రైలు బోగీలో ఓ ప్రయాణికుడు దీపం వెలిగించి పూజలు చేస్తూ, శంఖం ఊదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యప్ప స్వామి మాల ధరించిన ఆ ప్రయాణికుడు తన సీటు పక్కనే ఉన్న చిన్న టేబుల్‌పై దీపం వెలిగించి పూజలు నిర్వహిస్తున్నట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఏ రైలులో జరిగిందనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
Train Fire Safety | అగ్నిప్రమాద ముప్పు..
మతపరమైన విశ్వాసాలు, ప్రార్థనలు వ్యక్తిగత అంశాలైనప్పటికీ, కదులుతున్న రైలులో నిప్పు లేదా దీపం వెలిగించడం ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏసీ కోచ్‌లు పూర్తిగా మూసి ఉన్న ప్రదేశాలు కావడంతో, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద అగ్నిప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. మంటలు చెలరేగితే వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు, రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ, తోటి ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టడం సరికాదని విమర్శిస్తున్నారు.
Train Fire Safety | రైల్వే నిబంధనలు..
రైళ్లలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే కఠినమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలను అమలు చేస్తోంది. పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ ( Gas ) సిలిండర్లు, బాణసంచా వంటి మండే స్వభావం ఉన్న వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడం నిషేధం. దీపం వెలిగించడం వంటి ఘటనల్లో తీసుకునే చర్యలు అక్కడ ఉపయోగించిన వస్తువు స్వభావం, ఏర్పడిన ప్రమాద తీవ్రత, పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రయాణ సమయంలో ఎక్కడైనా అగ్నిప్రమాద ముప్పు కనిపించినా, భద్రతకు భంగం కలిగే చర్యలు జరిగినా వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలి. లేదా రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కు కాల్ చేసి, రైల్ మదద్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vaikunta Dwara Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల వివరాలు