అక్షరటుడే, వెబ్‌డెస్క్: Thiruparankundram | తమిళనాడు (Tamil Nadu)లోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు కొండపై దీపం వెలిగించేందుకు భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సికందర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలకు ముస్లింలు సన్నాహాలు చేస్తున్నారు.
కొండపై ఆలయం, దర్గా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఆలయం వద్ద గల రాతిస్తంభంపై దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించాలని ఆదేశించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం దీపం వెలిగించలేదు. దీంతో శుక్రవారం కోర్టు విజయ్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు అధికారులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు “తమ రాజకీయ నాయకుల (రాజకీయ యజమానుల)” ఆదేశాల మేరకు వ్యవహరించారని ఆరోపించింది. శనివారం దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. అంతేగాకుండా ఆలయ బోర్డు ట్రస్టీలను సస్పెండ్ చేసింది.
Thiruparankundram | భారీగా పోలీసులు మోహరింపు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీపం వెలిగించేందుకు హిందువులు సిద్ధం అవుతుండగా.. ముస్లింలు దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని చెప్పడం గమనార్హం. ప్రార్థనల కోసం ఉదయం నుంచి కొండపైకి వందలాది మంది ముస్లింలు చేరుకుంటున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Thiruparankundram | మధురైకి పయనం
కోర్టు నియమించిన సంయుక్త రిసీవర్లు, జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్, శనివారం మధురైకి బయలుదేరారు. సుప్రీంకోర్టు సస్పెండ్ చేసిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీల నుండి తిరుప్పరంకుండ్రం ఆలయ పరిపాలనా బాధ్యతలను వీరు స్వీకరించనున్నారు. మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్, మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. పార్థిబన్ ఉదయపు విమానంలో మధురైకి పయనమయ్యారు.