అక్షరటుడే, కామారెడ్డి: Koti Deepotsavam | లోక కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం కామారెడ్డి (Kamareddy)లో రేపు భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. శ్రీ చండీ మహా యజ్ఞ సహిత శ్రీ మహా రుద్ర యజ్ఞం, కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
Koti Deepotsavam | ఉదయం 7 గంటల నుంచి..
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ఈ యజ్ఞ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమానికి కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానం వేదిక కానుంది. రవి పుష్య యోగం కలిగిన అత్యంత మహోత్కృష్టమైన రోజున ఈ యాగం జరుగుతుండటం విశేషం. ఉదయం 7 గంటలకు గోపూజ, ధ్వజారోహణ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, అష్టదిక్పాలక నవగ్రహారాధన, చతుషష్టి యోగిని మండప పూజ, ప్రధాన కలశపూజ, మండపారాధనలు జరుగునున్నాయి. ఉదయం 9 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, హోమ కార్యక్రమం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటలకు పూర్ణాహుతి, ప్రవచన కార్యక్రమం, మధ్యాహ్నం 2 గంటలకు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Koti Deepotsavam | విఘ్న నివారణకు గణపతి హోమం..
విఘ్న నివారణకు గణపతి హోమం, ఆరోగ్యం కోసం ఆయుష్షు, మృత్యుంజయ హోమం, ఐశ్వర్యం కోసం శ్రీ మహాలక్ష్మి కుబేర హోమం నిర్వహించనున్నారు. అలాగే గృహశాంతి, మానసిక ధైర్యం, కుటుంబ క్షేమం కొరకు, కార్యసిద్ధి, విజయం, ఆనందం, సంతానం, సౌభాగ్యం, మనోవాంఛ & సర్వరక్షణ కొరకు, శ్రీ దేవి అనుగ్రహం కోసం ఈ హోమం జరుగనుంది. ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ఒక్క జంటకి రూ.5100 చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. చండీ హోమ సహిత మహారుద్ర యాగంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు కోరారు.
ఇది కూడా చదవండి..: Silent Political Party | ఎక్స్ వేదికపై ‘సైలెంట్ పార్టీ’ ప్రశ్నల వర్షం.. స్పందిస్తున్న ఫాలోవర్లు