అక్షరటుడే, కామారెడ్డి: Silent Political Party | ఉమ్మడి జిల్లాలో గుర్తుతెలియని ఓ రాజకీయ పార్టీ కరపత్రాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. వారెవరో తెలియదు.. ఏ పార్టీయో తెలియదు.. కానీ వారు సంధిస్తున్న ప్రశ్నలు మాత్రం ప్రజలను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నాయి.
Silent Political Party | రెండు రోజుల క్రితం న్యూస్ పేపర్లలో..
రెండు రోజుల క్రితం దినపత్రికల మధ్యలో ఈ కరపత్రాలు దర్శనమిచ్చాయి. పేపర్ తిరగేస్తున్న పాఠకులకు ఒక్కసారిగా ఆ కరపత్రంపై ఉన్న ప్రశ్నలు కంటపడ్డాయి. వీటిని ఎవరు వేశారు? ఎందుకు వేశారు? అనే దానిపై జిల్లావ్యాప్తంగా చర్చ మొదలైంది.అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో ఈ పార్టీ పేరుతో ఏకంగా ఓ ప్రత్యేక పేజీని కూడా ప్రారంభించారు. ఆ పేజీకి ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ‘ఎక్స్’ (X) వేదికగా ఓ విచిత్రమైన గొంతుతో ప్రభుత్వాన్ని, ఓటర్లను సూటిగా ప్రశ్నిస్తున్న ఆడియోలు వైరల్ అవుతున్నాయి.
Silent Political Party | అపరిచిత ముఖంతో ఓ వ్యక్తి..
ఎవరో అపరిచిత వ్యక్తి ముఖం చూపించకుండా, పేరు చెప్పకుండా కేవలం తన గొంతుతోనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎటువంటి సభలు, సమావేశాలు లేవు.. నాయకుల ముఖాలు అసలే కనిపించవు.. కానీ ఆ విచిత్ర గొంతు నుంచి వస్తున్న ప్రశ్నలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకే జనం దీనిని ‘సైలెంట్ పొలిటికల్ పార్టీ’గా పిలుస్తున్నారు.
Silent Political Party | ’ఎక్స్’ వేదికగా వినిపిస్తున్న ఆ ప్రశ్నలివే:
”ఓటు వేసే రోజు నువ్వు మహారాజువు. నువ్వు ఓటు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడుతుంది. నీ పన్నులతోనే ప్రభుత్వం నడుస్తుంది. నీ జీవితాలతో పాలకుల భవిష్యత్తు నిర్ణయమవుతుంది. మరి ఆ తర్వాత ఐదేళ్ల పాటు నువ్వెవరు? ప్రశ్నిస్తే ‘నీకు రాజకీయాలు ఎందుకు?’ అంటారు. నిలదీస్తే ‘అభివృద్ధికి అడ్డం’ అంటారు. హక్కులు అడిగితే ‘వ్యవస్థకే ప్రమాదం’ అంటారు. అధికారం ఇచ్చింది ప్రజలే కదా.. మరి ఆ అధికారాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదా? పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా?”అని ఆ అపరిచిత వ్యక్తి వేస్తున్న సూటి ప్రశ్నలు సామాన్యులను ఆలోచనలో పడేస్తున్నాయి.
Silent Political Party | రిప్లై ఇస్తున్న ఫాలోవర్లు..
ఈ ప్రశ్నలకు ఎక్స్‌లో నెటిజన్లు, ఫాలోవర్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు ఆ ప్రశ్నలకు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చ మరింత వేడెక్కుతోంది. ‘ఎవరు ఈ వ్యక్తి? ఏం చేయబోతున్నారు?’ అనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కరపత్రాల వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు జిల్లాలో పెద్ద మిస్టరీగా మారింది. ఇది ఏదైనా కొత్త రాజకీయ పార్టీ వ్యూహమా? లేక ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎవరైనా చేస్తున్న ప్రయత్నమా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వారు వేస్తున్న ప్రశ్నలు మాత్రం ప్రతి ఓటరును ఆలోచింపజేస్తున్నాయని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Isannapalli Kalabhairava | ఇసన్నపల్లి కాలభైరవ స్వామి ఉత్సవాలకు వేళాయే..