Women Staff Harassment | తెయూలో మహిళా సిబ్బందిపై వేధింపులు.. హద్దులు మీరుతున్న కొందరు ప్రొఫెసర్ల ప్రవర్తన

తెలంగాణ యూనివర్సిటీలో కొందరు ప్రొఫెసర్లు మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, తెయూ క్యాంపస్ : Women Staff Harassment | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)లో ఔట్​ సోర్సింగ్, కాంట్రాక్ట్, పార్ట్ టైం మహిళా సిబ్బందిపై కొందరు ప్రొఫెసర్లు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ప్రొఫెసర్ల ప్రవర్తన వివాదాస్పదంగా మారుతోంది.

యూనివర్సిటీ హెల్త్ సెంటర్​ (Health Center)లో గత నెలలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో మహిళ ఉద్యోగుల భద్రత, గౌరవంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన పరమైన పదవిలో ఉన్న ఓ సీనియర్ ప్రొఫెసర్ గత నెలలో హెల్త్ సెంటర్​కు వెళ్లి తన వేలుకు గాయమైందని టీటీ వేయాలని ఔట్​ సోర్సింగ్ సిబ్బందిని అడిగినట్లు సమాచారం. ఇంజక్షన్ ఇచ్చే సమయంలో ప్రొఫెసర్ అసభ్యకర మాటలతో అనుచితంగా వ్యవహరించడంతో ఆమె బయటకు పరుగెత్తుకోచ్చింది. ఆయన తీరుపై తోటి సిబ్బందితో చెప్పుకొని బోరున విలపించింది. పైస్థాయి అధికారి, అందులో సీనియర్ ప్రొఫెసర్ కావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు భయపడింది.

Women Staff Harassment | చర్యలు తీసుకోని రిజిస్ట్రార్​

ప్రొఫెసర్ వ్యవహారంపై ఔట్ సోర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ యాదగిరిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేశారు. అయితే ఆయన రెగ్యులర్​ ఉద్యోగి అని ఎలా సస్పెండ్​ చేస్తామని రిజిస్ట్రార్​ ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. సదరు ప్రొఫెసర్​తో బాధిత మహిళకు క్షమాపణ చెప్పించి విషయం రాద్దాంతం చేయవద్దని రిజిస్ట్రార్ హెచ్చరించినట్లు యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు వీసీ యాదగిరిరావును కలిసి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ అంశమై వీసీ యాదగిరిరావు (VC Yadagiri Rao) ను ‘అక్షరటుడే’ ఫోన్లో సంప్రదించగా… మహిళా ఉద్యోగిపై ప్రొఫెసర్ అనుచితంగా వ్యవహరించిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సదరు ప్రొఫెసర్​ను తీవ్రంగా మందలించినట్లు చెప్పారు. విద్యార్థులు, పోకిరీలు తప్పు చేస్తే మందలించాల్సిన ప్రొఫెసర్ ఇలాంటి పని చేయడం సిగ్గు చేటన్నారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఎవరైనా వేధిస్తే తనకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Women Staff Harassment | అవుట్‌ సోర్సింగ్ సిబ్బందే టార్గెట్?

యూనివర్సిటీలో అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకపోవడంతో తరచూ ఒత్తిడులకు గురవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శాశ్వత ఉద్యోగుల మాదిరిగా రక్షణ లేకపోవడం, కాంట్రాక్టు పునరుద్ధరణ భయం కారణంగా అనేక మంది తమకు ఎదురైన అవమానాలు, వేధింపుల గురించి బయటకు చెప్పడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.

Women Staff Harassment | ఉద్యోగం పోతుందని..

కొన్ని సందర్భాల్లో ఉన్నత హోదాలో ఉన్న ప్రొఫెసర్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళా సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనికి సంబంధం లేని వ్యక్తిగత వ్యాఖ్యలు, అసభ్యకర సందేశాలు, ఒంటరిగా కలవాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని యూనియన్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేస్తే ఉద్యోగం పోతుంది, పనిస్థలంలో ఇబ్బందులు పెరుగుతాయి, పేరు చెడిపోతుంది అనే భయాలతో చాలా మంది మహిళలు నోరు విప్పడం లేదని సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడిన ప్రొఫెసర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : Food Safety | బోధన్​లో ఫుడ్​సేఫ్టీ అధికారుల దాడులు.. రెస్టారెంట్లకు నోటీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *