Kamareddy Police Family Meet | కుటుంబ సభ్యుల అండదండలే పోలీసులకు అతిపెద్ద బలం : ఎస్పీ రాజేష్ చంద్ర

భార్య, పిల్లలు అందించే అండదండల వల్లే పోలీసులు మరింత ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించగలుగుతున్నారని ఎస్పీ అన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kamareddy Police Family Meet | పోలీసుల విధి నిర్వహణలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. పోలీసు కుటుంబాల ఆత్మీయతను పెంపొందించే ఉద్దేశంతో మంగళవారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు పోలీసు సిబ్బంది కుటుంబాలను ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా పలకరించారు. వారి కుటుంబ వివరాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆప్యాయంగా మాట్లాడారు.

Kamareddy Police Family Meet | ఆటపాటలతో సందడిగా..

కార్యక్రమంలో పోలీసు కుటుంబాల మధ్య స్నేహభావం, ఆత్మీయత పెంపొందించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బతుకమ్మ పాటలతో ప్రాంగణం సందడిగా మారగా, మహిళా పోలీసులు, పోలీసు కుటుంబ సభ్యులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. డీజే పాటలకు ఎస్పీ రాజేష్ చంద్ర కూడా కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేయడంతో కార్యక్రమంలో ఉత్సాహం నెలకొంది.

Kamareddy Police Family Meet | పోలీసు ఉద్యోగం ఓ బాధ్యత

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం చేసే ఉద్యోగం కాదని, ప్రజల భద్రతకు సంబంధించిన బాధ్యత అని అన్నారు. పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో తరచూ కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ప్రజలు పండుగలు, వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు విధుల్లో ఉంటారని గుర్తు చేశారు. ఇలాంటి ఒత్తిడితో కూడిన విధుల్లో కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం పోలీసులకు ఎంతో ధైర్యాన్నిస్తాయని తెలిపారు. భార్య, పిల్లలు అందించే అండదండల వల్లే పోలీసులు మరింత ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించగలుగుతున్నారని అన్నారు.

Kamareddy Police Family Meet | పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం

పోలీసు కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. పోలీసు కుటుంబాల్లో పిల్లల విద్య, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *