అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Contractor Issues Resolution | రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. బిల్డర్స్, కాంట్రాక్టర్లతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్ అండ్ బి శాఖలోనే దాదాపు రూ.4,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని, యాదాద్రి దేవస్థానం నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలకు సైతం ఇప్పటికీ రూ.350 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
Contractor Issues Resolution | రూ.3 వేల కోట్లు విడుదల చేశాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లకు రూ.3వేల కోట్లకు పైగా బిల్లులు విడుదల చేశామని, ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన మొత్తం బకాయిలు ఒక దశలో రూ.8,000 కోట్లకు చేరాయని గుర్తుచేశారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి సహా ఆరుగురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తీవ్రంగా కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Contractor Issues Resolution | ఆందోళనను విరమించుకోవాలి
చిన్న కాంట్రాక్టర్లు, ఎల్ఈడీ లైట్ల పనులు చేసిన సంస్థలు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.140 కోట్ల మేర చెల్లింపులు జరిపామన్నారు. ఈ నెల 18న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని తెలంగాణ బిల్డర్స్, కాంట్రాక్టర్స్ మంత్రి కోరారు. త్వరలో సీఎం, డిప్యూటీ సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల సమస్యలపై సమగ్ర చర్చ జరుపుతామన్నారు.
దీనిని కూడా చదవండి : ACB Raids | సర్వే అండ్ ల్యాండ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు