Stalin Delimitation Stand | డీలిమిటేషన్​పై మా నిర్ణయం మారదు.. స్పష్టం చేసిన స్టాలిన్​

డీలిమిటేషన్​ బిల్లుకు మద్దతు విషయంలో తమ నిర్ణయం మారదని డీఎంకే అధినేత స్టాలిన్​ స్పష్టంచేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stalin Delimitation Stand | డీలిమిటేషన్​ బిల్లుకు మద్దతు విషయంలో తమ నిర్ణయం మారదని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ (Stalin)​ స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడిన సీనియర్ ప్రతిపక్ష నాయకుల బృందం, కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతును ఉపసంహరించుకోవాలని స్టాలిన్‌ను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఆదివారం చెన్నైలో ఆయనను కలిసింది. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు.

కాంగ్రెస్​ అగ్రనేతలతో పాటు సీఎంలు రేవంత్​రెడ్డి, డీకే శివకుమార్​, వీడీ సతీషన్​, ఇతర నాయకులు స్టాలిన్​ను ఆయన నివాసంలో కలిశారు. వారికి డీఎంకే అధినేత ఘన స్వాగతం పలికారు. అనంతరం డీలిమిటేషన్​పై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని కూటమి నేతలు ఆయనను కోరారు. అయితే అందుకు స్టాలిన్​ ఒప్పుకోలేదు. సమావేశం అనంతరం ఆయన ఎక్స్​ వేదికగా పోస్టు పెట్టారు.

Stalin Delimitation Stand | వీగిపోతే తమిళనాడుకు ప్రమాదం

డీఎంకే (DMK) మొదట లేవనెత్తిన డిమాండ్లు కొత్త ‘నియోజకవర్గాల పునర్విభజన బిల్లు’లో చేర్చబడ్డాయని తాను కూటమి నేతలకు వివరించానని స్టాలిన్​ తెలిపారు. ఒకవేళ ఈ బిల్లు వీగిపోతే, ప్రస్తుతం తమిళనాడుకు ఉన్న కనీస రక్షణలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జనవరిలో ఏర్పాటు కానున్న ‘డీలిమిటేషన్ కమిషన్’ వల్ల దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరిగితే, దానిని అడ్డుకునే పార్లమెంటరీ బలం తమకు ఉండొదని చెప్పారు.

Stalin Delimitation Stand | మరో మార్గం లేదు

1971 తర్వాత జరిగిన జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, తమిళనాడు ప్రాతినిధ్యాన్ని, రాజకీయ బలాన్ని తగ్గించేలా ఉంటుందని స్టాలిన్​ తెలిపారు. దక్షిణ రాష్ట్రాల పార్టీలకు ఇది మనుగడకు సంబంధించిన పోరాటం అన్నారు. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. తనతో సమావేశమైన పార్టీల వద్ద కూడా వేరే ప్రణాళిక ఏమీ లేదని తెలిపారు. పార్లమెంటులో మనకున్న బలాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, రాబోయే 25 ఏళ్ల పాటు తమిళనాడు రాజకీయ స్థానాన్ని మనం సురక్షితం చేసుకున్నామని చెప్పారు. ఇక్కడ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి గానీ, కేవలం భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడానికి గానీ తావులేదన్నారు. తమిళనాడు హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

దీనిని కూడా చదవండి : Eagle Force | గంజాయి విక్రయిస్తూ దొరికిన ఐటీ ఉద్యోగి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *