అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rayachoti Attack | అన్నమయ్య జిల్లా (Annamayya District) రాయచోటిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత, రాయచోటి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పి. దశరథరామిరెడ్డిపై ఆదివారం జరిగిన దాడి స్థానికంగా సంచలనం సృష్టించింది.
భూవివాదం నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో గాయపడిన దశరథరామిరెడ్డిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం తిరుపతి (Tirupati)లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం.
Rayachoti Attack | కొంత కాలంగా భూవివాదం..
ఈ ఘటనకు కారణమైన భూవివాదం కొంతకాలంగా కొనసాగుతోంది. దశరథరామిరెడ్డికి చెందిన కల్యాణమండపం సమీపంలోని స్థలంపై వివాదం ఉండగా, ఈ విషయంపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ, ఆదివారం సుమారు 100 మంది ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు ఆ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ చర్యను అడ్డుకోవడానికి వెళ్లిన దశరథరామిరెడ్డిపై వారు మూకుమ్మడిగా దాడికి దిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ దాడిలో ఆయనతో పాటు అనుచరులు జాకీర్, దేరంగుల ఆంజనేయులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తులు కల్యాణమండపాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ఆయన వాహనాన్ని కూడా నాశనం చేసినట్లు సమాచారం.
Rayachoti Attack | రాయచోటిలో ఉద్రిక్త వాతావరణం
ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో చికిత్స పొందుతున్న బాధితులను రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని, ప్రేక్షకపాత్ర వహించారని మిథున్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థ క్షీణించిందని, అధికార పార్టీ ఒత్తిళ్లతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో రాయచోటిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ప్రాంతంలో బందోబస్తు పెంచి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడి వాంగ్మూలం నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి..: Accident in Tirupati | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అంబులెన్స్ లారీని ఢీకొని నలుగురు మృతి

