Amanpreet Singh Gill | క్రికెట్ లోకంలో విషాదం.. విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు అమన్ ప్రీత్ సింగ్ గిల్ కన్నుమూత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amanpreet Singh Gill | భారత క్రికెట్ వర్గాల్లో విషాదం నెలకొంది. పంజాబ్ మాజీ పేసర్, టీమిండియా అండర్-19 మాజీ క్రికెటర్ అమన్ ప్రీత్ సింగ్ గిల్ కన్నుమూశారు. ఆయన వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే.

ఈ విషాద వార్తతో పంజాబ్ క్రికెట్ వర్గాలు, మాజీ ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.అమన్ ప్రీత్ మరణానికి గల కారణాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం క్రీడా ప్రపంచాన్ని కలచివేసింది.

Amanpreet Singh Gill | విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 క్రికెట్

విరాట్ కోహ్లీ (Virat Kohli)తో కలిసి 2007లో భారత అండర్-19 జట్టుకు అమన్ ప్రీత్ ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఇద్దరూ సహచరులుగా యూత్ క్రికెట్ ఆడారు. ఆయన భారత అండర్-19 జట్టు తరఫున ఐదు వన్డేలు, ఒక యూత్ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొన్నారు. అదే కాలంలో భారత యువ జట్టులో ప్రతిభావంతమైన పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమన్ ప్రీత్.. తరువాత దేశీయ క్రికెట్‌లో పంజాబ్ తరఫున ఆడారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన జట్టులో అమన్ ప్రీత్ ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి మొత్తం 11 వికెట్లు తీశారు. తన బౌలింగ్‌లో క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావంతో సహచరుల్లో మంచి గుర్తింపు సంపాదించారు.

Amanpreet Singh Gill | క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా..

అలాగే 2008లో ప్రారంభమైన తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. అప్పట్లో యువ పేసర్‌గా మంచి భవిష్యత్తు ఉన్న ఆటగాడిగా భావించారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా అమన్ ప్రీత్ ఆటకు దూరం కాలేదు. పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తూ యువ ఆటగాళ్లను ప్రోత్సహించే పనిలో కొనసాగుతున్నారు. ఆయన మరణం పంజాబ్ క్రికెట్‌కు తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అమన్ ప్రీత్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పందిస్తూ.. అమన్ ప్రీత్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. కెరీర్ ప్రారంభ రోజుల్లో మేము కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాం. ఆయన చాలా సైలెంట్‌గా ఉండే వ్యక్తి.. కష్టపడి పనిచేసే క్రికెటర్. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని ట్వీట్ చేశారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా అమన్ ప్రీత్ మృతిపై సంతాపం తెలిపాయి. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకున్నాయి.

ఇది కూడా చదవండి..: SRH vs PBKS | ఎస్​ఆర్​హెచ్​ వీరంగం.. తలొగ్గిన పంజాబ్​ కింగ్స్​!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *