TDP Office Protest | టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట గిరిజనుల ధర్నా.. రూ.1.50 కోట్ల బకాయిల కోసం ఆందోళన

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: TDP Office Protest | మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ  (Telugu Desam Party) కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా (NTR District) మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలం కట్టుబడి పాలెం గ్రామానికి చెందిన సుమారు 200 మంది గిరిజనులు తమకు రావాల్సిన బకాయిల కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

పార్టీ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆరోపణల ప్రకారం, మంత్రి కొల్లి ర‌వీంద్ర‌ ముఖ్య అనుచరుడిగా చెప్పబడుతున్న పామర్తి రాజా తమతో వివిధ పనులు చేయించుకుని, దాదాపు రూ.1.50 కోట్ల మేర వేతనాలు చెల్లించకుండా మోసం చేశాడని తెలిపారు. పని పూర్తయిన తర్వాత పలుమార్లు డబ్బుల కోసం అడిగినా సరైన స్పందన ఇవ్వలేదని, పైగా తమను అవమానకరంగా మాట్లాడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.

TDP Office Protest | భారీ సంఖ్య‌లో గిరిజ‌నులు..

“మేము కష్టపడి పనిచేసిన డబ్బులు మాత్రమే అడుగుతున్నాం. ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదు. ఇప్పుడు పార్టీ కార్యాలయం ఎదుటే కూర్చుంటే తప్ప మా సమస్య ఎవరూ పట్టించుకోవడం లేదు” అంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా కారణంగా టీడీపీ కార్యాలయం (TDP Office) పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో గిరిజనులు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించారు.

TDP Office Protest | రావాల్సిన బకాయిలు ఇప్పించాలని డిమాండ్

ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన కీలక నేతల అనుచరులే గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు మాత్రం ప్రభుత్వం, పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి వెళ్లేది లేదని గిరిజనులు స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఆరోపణలపై పామర్తి రాజా లేదా టీడీపీ నాయకత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: MLA Bode Prasad | బస్ స్టాప్‌లో బస్సు ఆపకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్‌పై బోడె ప్రసాద్ ఆగ్రహం.. బస్సు అడ్డగించి మ‌రి నిలదీసిన ఎమ్మెల్యే

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *