అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gold Purchase Ban | “ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్ , ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు భారతీయులందరూ ఆర్థిక దేశభక్తిని చాటాలి.
రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. “మనం చేసే ప్రతి చిన్న పొదుపు, దేశాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది” అని పేర్కొన్నారు. ప్రధాని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Gold Purchase Ban | భారీగా విదేశీ మారక ద్రవ్యం వినియోగం..
భారతీయులకు బంగారం అంటే ఆభరణం మాత్రమే కాదు.. అంతకుమించిన అనుబంధం. అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా దేశంలో బంగారం ఉత్పత్తి లేకపోవడంతో విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. మన దేశం ఏటా సుమారు 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశీయ అవసరాలకోసం 99 శాతం బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనికోసం విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది.
Gold Purchase Ban | వాణిజ్య సమతుల్యత కోసం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, టారిఫ్‌ల ప్రభావంతోపాటు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Prices) గణనీయంగా పెరిగాయి. రెండు నెలల క్రితం పది గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షలకు చేరువయ్యింది. ప్రస్తుతం కాస్త తగ్గి రూ. 1.54 లక్షల వద్ద కదలాడుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగారం దిగమతులకు డాలర్లలో చెల్లింపులు జరుగుతాయి కాబట్టి దిగుమతుల బిల్లు పెరిగి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడుతోంది. ఇది ద్రవ్యలోటుకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు ఆపేయండి’ అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం వంటి అంతగా అవసరం లేని దిగుమతులను తగ్గించడం వల్ల వాణిజ్య లోటును అదుపులో ఉంచవచ్చని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించి దేశ ఆర్థిక పునాదులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Gold Purchase Ban | స్తబ్ధతనుంచి సంపదవైపు మళ్లించే లక్ష్యమా?
బంగారాన్ని ఆర్థికవేత్తలు డెడ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా పిలుస్తారు. ప్రజలు బంగారాన్ని బిస్కెట్లు లేదా నగల రూపంలో కొనుగోలు చేసి దాచి పెడుతుంటారు. అది దేశ ఉత్పత్తికి లేదా ఉద్యోగ కల్పనకు ఉపయోగపడదు. బంగారం కొనుగోలు చేయకుండా ఆ డబ్బును బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా ప్రయోజనాలు ఉంటాయి. బంగారం కొనుగోళ్లు తగ్గినప్పుడు ప్రజల వద్ద ఉన్న డబ్బు బ్యాంకులు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, తయారీ రంగాలకు మళ్లడానికి అవకాశం ఉంటుంది. బ్యాంకులలో చేసే డిపాజిట్లతో ప్రభుత్వానికి చాలా తక్కువ వడ్డీకే నిధులు సమకూరుతాయి. వాటిని మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తుంది. తద్వారా దేశ జీడీపీ వృద్ధి చెందుతుంది. అప్పులకోసం విదేశీ సంస్థల మీద ఆధారపడటం తగ్గుతుంది. ఏడాది పాటు బంగారం కొనకండి అన్న ప్రధాని పిలుపు దేశంలోని సంపదను స్తబ్ధత నుంచి ఉత్పాదకత వైపు మళ్లించడానికేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదని, అంతర్జాతీయ సంక్షోభం నుంచి మనల్ని మనం రక్షించుకునే ఒక వ్యూహాత్మక అడుగు అని భావిస్తున్నారు.
Gold Purchase Ban | తీవ్ర ఒత్తిడితో జువెల్లరీ స్టాక్స్..
ప్రధాన మంత్రి పిలుపుతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో జువెల్లరీ స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్‌కో గోల్డ్ వంటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్‌కో గోల్డ్ 9 శాతం వరకు పతనమవ్వగా.. టైటాన్ 6 శాతానికిపైగా నష్టంతో కదలాడుతోంది.
ఇది కూడా చదవండి..: Rupee Under Pressure | తీవ్ర ఒత్తిడిలో రూపాయి..

