అక్షరటుడే, వెబ్డెస్క్ : Student Addiction | యువత దారి తప్పుతున్నారు. చదువుకోవాల్సిన వయసులో చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. బడి పిల్లలు సైతం యథేచ్ఛగా సిగరెట్లు తాగుతున్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థుల గురించి చెప్పాల్సిన పని లేదు.
హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) శనివారం నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బడి పిల్లలు సైతం పాన్ డబ్బాల్లో సిగరెట్లు కొనుగోలు చేసి తాగుతున్నారు. ఇంజినీరింగ్ కాలేజీల బయట అయితే పాన్ డబ్బాలు అనేకం దీని కోసమే వెలిశాయి. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా బహిరంగంగా సిగరెట్ తాగుతున్నారు. ఇందులో అమ్మాయిలు సైతం ఉండటం గమనార్హం.
Student Addiction | మైనర్లకు విక్రయం
లాభమే పరమావధిగా భావిస్తున్న కొందరు దుకాణదారులు, నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యాసంస్థల సమీపంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. విద్యార్థులు, యువత ఇలా బహిరంగంగా సిగరెట్లు తాగుతూ తమ ఆరోగ్యాన్ని, భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. మొదట్లో సరదా కోసం సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. అనంతరం అది వ్యసనంగా మారుతోంది. పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులు సైతం ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచించారు.
Student Addiction | 558 దుకాణాలపై దాడులు
నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ (‘Operation Safe School’) పేరిట శనివారం పెద్ద ఎత్తున పోలీసులు దాడులు నిర్వహించారు. 5 వేల మంది పోలీసులు 558 పాన్ షాపులపై తనిఖీలు చేశారు. విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న దుకాణదారులకు వార్నింగ్ ఇచ్చారు. పలు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, రిజర్వ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడుల్లో పాల్గొన్నారు.
Student Addiction | భవిష్యత్ బుగ్గిపాలు
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను బడులకు పంపుతున్నారు. అయితే కొంత మంది విద్యార్థులు సరదా.. ఎంజాయ్మెంట్ పేరిట సిగరెట్లు, మద్యం అలవాటు చేసుకుంటున్నారు. అంతేగాకుంగా తమ స్నేహితులకు అలవాటు చేస్తున్నారు. బడీడులోనే వీటికి అలవాటు పడుతున్న వీరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులో నికోటిన్ (Nicotine)కు అలవాటు పడితే పెద్దయ్యాక డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..: MMTS Free Travel | హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం