అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bus Fire Accident | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా ఉలవపాడు (Ulavapadu) సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెద్ద విషాదం తప్పింది.
సమాచారం ప్రకారం, బస్సు ఉలవపాడు ప్రాంతానికి చేరుకునే సమయంలో వెనుక టైర్‌లో బేరింగ్ పట్టేయడంతో మొదట పొగలు రావడం ప్రారంభమైంది. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును ఆపి ప్రయాణికులకు హెచ్చరించారు. దీంతో ప్రయాణికులు తమ లగేజీతో పాటు హుటాహుటిన బస్సు నుంచి బయటకు దిగిపోయారు.
Bus Fire Accident | ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు..
ప్రయాణికులు దిగిన కొద్ది సేపటికే మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ఇక ప్రమాదం తర్వాత ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కావేరీ ట్రావెల్స్ (Kaveri Travels) యాజమాన్యం వెల్లడించింది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bus Fire Accident | ఈ ఘటనతో..
డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఎన్‌హెచ్-16పై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కూడా ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఆరాలు తీస్తున్నారు. ఆ మధ్య ఏపీలో జరిగిన పలు ప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం మనకు తెలిసిందే.
ఇది కూడా చదవండి..: AP Government Savings Measures|పొదుపు చర్యలపై ముందు ప్రజలను సిద్ధం చేద్దాం.. ఆపై అమలు చేద్దాం:పవన్ కల్యాణ్


