అక్షరటుడే వెబ్‌డెస్క్: Hormuz LPG Shipment |పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ భారతదేశానికి ఉపశమనం కలిగించే వార్త వెలువడింది. భారత్‌కు వస్తున్న రెండు కీలక ఎల్‌పీజీ (LPG) సరుకు రవాణా నౌకలు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ‘హర్ముజ్ జలసంధి’ మీదుగా సురక్షితంగా ప్రయాణించాయి. ఇందులో మార్షల్ దీవుల జెండాతో ప్రయాణిస్తున్న ‘సిమి’ (Symi) అనే ట్యాంకర్ సుమారు 20,000 టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌తో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న కాండ్లా పోర్టుకు చేరుకుంది. ఈ నౌక మే 13న హర్ముజ్ జలసంధిని దాటి భారత తీరానికి వచ్చింది.
Hormuz LPG Shipment | అవాంతరాలు లేకుండా ప్రయాణం
పశ్చిమ ఆసియా సంక్షోభంపై దిల్లీలో నిర్వహించిన అంతర్-మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. భారత్‌కు వస్తున్న రెండు ఎల్‌పీజీ నౌకలు హర్ముజ్ జలసంధి దాటిన విషయాన్ని ఆయన ధృవీకరించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) ప్రత్యేక సమన్వయంతో, అత్యంత కీలకమైన ఈ సముద్ర రవాణా మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. పర్షియన్ గల్ఫ్‌ను అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాలతో అనుసంధానించే ఈ కారిడార్‌పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిఘా పెరిగిన తరుణంలో ఈ గ్యాస్ నౌకలు రావడం గమనార్హం.
Hormuz LPG Shipment | ఇరాన్ విదేశాంగ మంత్రితో చర్చలు
మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ప్రాంతీయ పరిణామాలపై కీలక చర్చలు జరిపారు. హర్ముజ్ జలసంధి ప్రాంతంలో భద్రతను కాపాడటంలో ఇరాన్ ఎల్లప్పుడూ తన బాధ్యతను నిర్వర్తిస్తుందని అరాఘ్చి స్పష్టం చేశారు. వాణిజ్య భద్రత విషయంలో భారత్ లాంటి మిత్రదేశాలు ఇరాన్‌ను పూర్తి నమ్మకమైన భాగస్వామిగా భావించవచ్చని, తమపై ఆధారపడవచ్చని ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా పునరుద్ఘాటించారు.
ఇది కూడా చదవండి: Ebola Virus Outbreak | సరిహద్దులు దాటుతున్న ఎబోలా వైరస్.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO


