అక్షరటుడే వెబ్‌డెస్క్:RBI Recovery Rules|బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి లోన్లు తీసుకున్న వారిని రికవరీ ఏజెంట్లు వేధించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలకు సిద్ధమైంది. లోన్ల వసూళ్లు, రికవరీ ఏజెంట్ల ప్రవర్తనకు సంబంధించి ఆర్‌బీఐ తాజాగా సవరించిన మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. ప్రధానంగా ఫోన్ కొనుగోలు కోసం లోన్ తీసుకుని, ఈఎంఐ (EMI) కట్టలేదనే కారణంతో మొబైల్ ఫోన్లను వెంటనే బ్లాక్ చేయడం లేదా డీయాక్టివేట్ చేయడం కుదరదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
RBI Recovery Rules|ఫోన్ లాక్ చేయడం కుదరదు..
లోన్ ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే ఫైనాన్స్ కంపెనీలు వెంటనే ఫోన్‌ను లాక్ చేయడానికి వీల్లేదు. కనీసం 90 రోజుల పాటు బకాయి ఉంటేనే పరికరాన్ని నిలిపివేసే అవకాశం ఉంటుంది. అలాగే ఫోన్‌ను బ్లాక్ చేయడానికి ముందు 21 రోజులు, ఆ తర్వాత మరో 7 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఒకవేళ పొరపాటుగా లేదా అన్యాయంగా ఎవరిదైనా ఫోన్ బ్లాక్ చేస్తే.. సదరు రుణగ్రహీతకు గంటకు రూ. 250 చొప్పున బ్యాంకులు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
RBI Recovery Rules|భయపెట్టడం, బూతులు తిట్టడం ..
రికవరీ ఏజెంట్లు కస్టమర్లను భయపెట్టడం, బూతులు తిట్టడం, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం లేదా సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం వంటివి చేయకూడదు. బాధితులను, వారి బంధువులను లేదా స్నేహితులను శారీరకంగా, మానసికంగా వేధించడం లేదా సమాజంలో అవమానించేలా ప్రవర్తించడాన్ని ఆర్‌బీఐ “క్రూరమైన పద్ధతి”గా వర్గీకరించింది. ఎక్కువ రికవరీలు చేస్తే ఏజెంట్లకు ఇచ్చే అదనపు ప్రోత్సాహకాలను (Incentives) కూడా ఆర్‌బీఐ నిషేధించింది. దీనివల్ల వారు డబ్బుల కోసం కస్టమర్లపై బలవంతం చేసే అవకాశం తగ్గుతుంది.
RBI Recovery Rules|కాల్స్ చేయడానికి, ఇంటికి రావడానికి వేళలు ..
రికవరీ ఏజెంట్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య మాత్రమే లోన్ రికవరీ కోసం కాల్స్ చేయడం లేదా ఇంటికి వెళ్లడం చేయాలి. ఆ సమయం దాటిన తర్వాత కస్టమర్లను సంప్రదించడానికి అనుమతి లేదు. అంతేకాకుండా, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు (దుఃఖంలో ఉన్నప్పుడు) లేదా ఇంట్లో పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో బాధితులకు ఫోన్ చేయడం గానీ, వారిని కలవడం గానీ చేయకూడదు.
RBI Recovery Rules|ఐడీ కార్డు తప్పనిసరి..
రికవరీ ఏజెంట్లు కస్టమర్ దగ్గరకు వెళ్లినప్పుడు కచ్చితంగా ఐడీ కార్డు, బ్యాంక్ ఇచ్చిన అధికార పత్రాన్ని (Authorisation Letter) కలిగి ఉండాలి. ఏజెంట్లు కస్టమర్లతో మాట్లాడే కాల్స్ అన్నింటినీ రికార్డ్ చేసి, కనీసం 6 నెలల పాటు ఆ డేటాను భద్రపరచాలి. అలాగే బ్యాంకులు తమ యాప్‌లు, వెబ్‌సైట్లలో తాము నియమించుకున్న రికవరీ ఏజెన్సీల వివరాలను స్పష్టంగా ఉంచాలి. కంటిన్యూగా కస్టమర్ ఇంటికి రికవరీ ఏజెంట్ వచ్చే ముందే కస్టమర్‌కు సమాచారం ఇవ్వడం తప్పనిసరి.
RBI Recovery Rules|ఫిర్యాదులు ఉంటే రికవరీ ప్రక్రియ ఆపాల్సిందే..
కస్టమర్ చేసిన ఫిర్యాదులు లేదా సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటే, ఆ కేసులను బ్యాంకులు రికవరీ ఏజెంట్లకు అప్పగించకూడదు. ఒకవేళ తప్పుడు రికవరీ పద్ధతుల వల్ల కస్టమర్లకు నష్టం వాటిల్లితే బ్యాంకులు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రికవరీ ఏజెంట్లు హద్దులు మీరుతున్నారనే ఫిర్యాదులు ఎక్కువవడంతో.. బాధితుల హక్కులను కాపాడటం కోసం ఆర్‌బీఐ ఈ సమగ్ర నిబంధనలను ముందుకు తెచ్చింది.
ఇది కూడా చదవండి:Land Pattas | అర్హులందరికీ భూ పట్టాలు అందిస్తాం: మంత్రి పొంగులేటి


