అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Name Confusion Stocks | చాలా మంది పేరులో ఏముంది అనుకుంటారు. కానీ కొన్ని పేర్లలో మ్యాజిక్ ఉంటుంది. అది అకస్మాత్తుగా సిరులను కురిపిస్తుంది. అలా కేవలం ‘పేరు’తో లాభాల వర్షం కురిసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పేరు ఒకేలా ఉండడంతో వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా పెట్టుబడిదారులు కంగారుపడి అదేపేరును పోలిన కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి ఉదంతాలను తెలుసుకుందామా..
Name Confusion Stocks | పార్లే ఇండస్ట్రీస్, పార్లే ప్రొడక్ట్స్..
మన ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇటీవల ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని కలిసినప్పుడు పార్లె ప్రొడక్ట్స్ కు సంబంధించిన మెలోడీ చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారడంతో ‘పార్లే’ పేరు నెట్టింట మార్మోగింది. అది కాస్తా మెలోడీతో ఏ సంబంధం లేని ‘పార్లే ఇండస్ట్రీస్’ (Parle Industries)కు కలిసొచ్చింది. రెండు రోజులుగా ఆ కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్ ను తాకుతూ ఇన్వెస్టర్ల సంపద పెంచుతున్నాయి. కాగా మెలోడీ చాక్లెట్లను తయారు చేసే పార్లే ప్రొడక్ట్స్ సంస్థ అసలు స్టాక్ మార్కెట్లోనే లిస్ట్ కాకపోవడం గమనార్హం.
Name Confusion Stocks | సిగ్నల్ అడ్వాన్స్, సిగ్నల్ యాప్..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) 2021 జనవరిలో తన ఫాలోవర్లకు ‘యూజ్ సిగ్నల్’ అని ట్వీట్ చేశారు. అప్పట్లో మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’లో గోప్యతపై ఆందోళనలు వ్యక్తమైన సమయంలో ఆయన మెసేజింగ్ యాప్ అయిన సిగ్నల్ ను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇన్వెస్టర్లు పొరపాటు పడి సిగ్నల్ అడ్వాన్స్ అనే మైక్రో క్యాప్ కంపెనీ షేర్లను తెగ కొనేశారు. దీంతో ఈ షేరు విలువ ఏకంగా 5,100 శాతం పెరిగింది.
Name Confusion Stocks | బాంబే ఆక్సిజన్ , బాంబే బర్మా..
భారతదేశంలో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ తయారీ సంస్థల షేర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో ప్రజలు బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ పేరులో ఆక్సిజన్ ఉండడంతో అది ఆక్సిజన్ సిలిండర్లు తయారు చేస్తుందని భావించి దాని షేర్లను కొనిపారేశారు. కానీ ఆ కంపెనీ ఆక్సిజన్ తయారీ వ్యాపారం నుంచి 2019లోనే బయటికొచ్చి నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా మారింది. 2021 మార్చి 31న దాదాపు రూ. 11వేలు ఉన్న షేరు విలువ.. ఆ ఏడాది ఏప్రిల్ 20 నాటికి ఏకంగా రూ. 25,500 లకు చేరింది.
Name Confusion Stocks | ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రోస్..
ఎల్జీ ఎలక్ట్రానిక్స్: గతేడాది అక్టోబర్‌లో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యింది. ఆ కంపెనీ లిస్టింగ్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ‘ఎల్జీ’ పేరు విషయంలో ఇన్వెస్టర్లు గందరగోళానికి గురయ్యారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అనుకుని ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రోస్ అనే ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీ షేర్లను పొరపాటున కొనుగోలు చేశారు.
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్, జూమ్ టెక్నాలజీస్ : కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వీడియో కాలింగ్ యాప్ జూమ్ వాడకం గణనీయంగా పెరిగింది. దీంతో జూమ్ వీడియో కమ్యూనికేషన్స్, చైనాకు చెందిన జూమ్ టెక్నాలజీస్ సంస్థల మధ్య గందరగోళానికి గురయ్యారు. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ అనుకుని జూమ్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లను ఎగబడి కొన్నారు.
మెటా, మెటీరియల్స్ : 2021లో మెటావర్స్‌పై దృష్టిపెట్టిన ఫేస్బుక్.. తన మాతృసంస్థ పేరును మెటాగా మార్చింది. ఈ పరిణామాలకు ఏమాత్రం సంబంధం లేనప్పటికీ ఆ సమయంలో కెనడా మెటీరియల్స్ కంపెనీ ‘మెటా మెటీరియల్స్’ భారీగా లాభపడింది. ఈ కంపెనీ షేర్లు అమాంతం పెరిగాయి.
ఇది కూడా చదవండి..: May 22 Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్‌లో ప్రారంభంకానున్న సెన్సెక్స్


