Honduras Massacre | హోండురస్‌లో రక్తపాతం.. రెండు దాడుల్లో 25 మంది మృతి, ఆరుగురు పోలీసులు బలికావడంతో భయాందోళనలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Honduras Massacre | మధ్య అమెరికా దేశం హోండురస్‌ (Honduras)లో గురువారం జరిగిన రెండు వేర్వేరు హింసాత్మక ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో ఆరుగురు పోలీసులు ఉన్నారు.

ఈ ఘటనలతో దేశంలో భద్రతా పరిస్థితులపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.మొదటి ఘటన దేశ ఉత్తర ప్రాంతంలోని ట్రుజిల్లో మున్సిపాలిటీ (Trujillo Municipality) పరిధిలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో చోటుచేసుకుంది. అక్కడ పనిచేస్తున్న కార్మికులపై సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 19 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Honduras Massacre | ఆరుగురు మృతి…

అయితే సంఘటన తర్వాత మృతుల కుటుంబ సభ్యులు తమ వారి మృతదేహాలను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లడంతో మృతుల ఖచ్చిత సంఖ్యపై స్పష్టత రావడం కష్టమైందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలను పంపినట్లు అధికారులు తెలిపారు. ఇక రెండో ఘటన గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలోని ఓమోవా ప్రాంతంలో జరిగింది. గ్యాంగ్‌ల కార్యకలాపాలపై ప్రత్యేక ఆపరేషన్ కోసం వెళ్తున్న పోలీసు బృందంపై దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో ఒక సీనియర్ అధికారి సహా ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.

Honduras Massacre | నేర ముఠాల కార్యకలాపాలు

హోండురస్‌లోని ట్రుజిల్లో ప్రాంతం సహజ వనరులతో సంపన్నమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అయితే దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో భూవివాదాలు కొనసాగుతున్నాయి. భూముల హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న కార్యకర్తలు తరచూ బెదిరింపులు, దాడులను ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరాల్లో కూడా అక్కడ పర్యావరణ కార్యకర్తల హత్యలు చోటుచేసుకున్నాయి. దీంతో హోండురస్‌లో భూవివాదాలు, నేర ముఠాల కార్యకలాపాలు మరింత తీవ్రమయ్యాయని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.

ఈ రెండు ఘటనలపై హోండురస్ ప్రభుత్వం (Honduras Government) తీవ్రంగా స్పందించింది. భద్రతా దళాలు, జాతీయ పోలీసు బలగాలను వెంటనే సంఘటన ప్రాంతాలకు తరలించినట్లు భద్రతా శాఖ వెల్లడించింది. అలాగే ఫోరెన్సిక్ నిపుణులు, న్యాయాధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.

ఇది కూడా చదవండి..: Iran Uranium Stockpile | యురేనియం నిల్వలు దేశం దాటకూడదు: మొజ్తాబా ఖమేని

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *