ABHA Health ID | ప్రైవేట్​ ఆస్పత్రుల్లోనూ ‘ఆభా’.. క్లిక్ చేస్తే రోగి ఆరోగ్య చరిత్ర!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజయవంతంగా నడుస్తున్న ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’ (ABHA - ఆభా) ఐడీల జారీ ప్రక్రియను ప్రైవేటు వైద్య రంగంలోనూ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్  : ABHA Health ID | ప్రభుత్వ ఆస్పత్రుల్లో విజయవంతంగా నడుస్తున్న ‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’ (ABHA – ఆభా) ఐడీల జారీ ప్రక్రియను ప్రైవేటు వైద్య రంగంలోనూ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మొదటి విడతగా యాదాద్రి-భువనగిరి జిల్లాలో దీనిని ‘పైలట్ ప్రాజెక్టు’గా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే తదుపరి విడతలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు సైతం ఈ డిజిటల్ కార్డుల విధానాన్ని విస్తరించనున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నుంచి చిన్న నర్సింగ్ హోమ్‌ల వరకు ఉన్న సుమారు 250కి పైగా రిజిస్టర్డ్ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ విధానం అందుబాటులోకి వస్తే రోగులకు, వైద్యులకు ప్రయోజనాలు కలగనున్నాయి. రోగులు ఏదైనా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేటప్పుడు పాత ప్రిస్క్రిప్షన్లు, ఎక్స్-రేలు, ల్యాబ్ రిపోర్టుల ఫైళ్లను భారీగా మోసుకువెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో వాటిని మరిచిపోతే మళ్లీ కొత్తగా పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. ఆభా ఐడీ (14 అంకెల సంఖ్య) వస్తే.. రోగి అనుమతితో డాక్టర్లు కంప్యూటర్ స్క్రీన్‌పై ఒక క్లిక్‌తో గత చరిత్రనంతటినీ చూసేయవచ్చు.

ABHA Health ID | అనవసర ఖర్చులకు చెక్

ABHA Health ID

ఒక ఆస్పత్రిలో చేయించుకున్న రక్త, స్కానింగ్ పరీక్షల వివరాలు డిజిటల్‌గా లాక్ అయి ఉంటాయి. దీంతో మరో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆ నివేదికల ఆధారంగానే తదుపరి వైద్యం అందిస్తారు. దీనివల్ల రోగులకు పదే పదే పరీక్షలు చేయించుకునే ఖర్చు తప్పుతుంది. రోడ్డు ప్రమాదాలు లేదా గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో రోగి స్పృహలో లేకపోయినా, వారి ఆభా కార్డు నంబర్ లేదా మొబైల్ నంబర్ ద్వారా వారి బ్లడ్ గ్రూప్ ఏంటి? గతంలో ఏవైనా జబ్బులు ఉన్నాయా? ఏ మందుల వల్ల అలర్జీ వస్తుంది? వంటి కీలక సమాచారాన్ని వైద్యులు తక్షణమే తెలుసుకుని ప్రాణాలు కాపాడే చికిత్సను ఆలస్యం లేకుండా ప్రారంభించవచ్చు.

ABHA Health ID | వేగంగా సేవలు

ఆభా విధానం అమల్లోకి వస్తే ఆస్పత్రుల్లో ఓపీ (OP) నిర్వహణ సులువవుతుంది. రోగికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. రోగీకి సంబంధించిన పాత పైళ్లు అందుబాటులో ఉండటంతో వైద్యులు నేరుగా చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది.

ABHA Health ID | ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలో వందలాది హాస్పిటళ్లు ఉన్నాయి. వీటిలో నిత్యం వేలాది మంది ఓపీ సేవలు పొందుతున్నారు. ప్రైవేట్​ ఆస్పత్రులు డిజిటల్ హెల్త్ మిషన్‌లో భాగస్వామ్యమై రోగులకు ఆభా ఐడీలను లింక్ చేస్తే.. ప్రతి రికార్డు నమోదుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 20 వరకు ప్రోత్సాహకం నేరుగా ఆయా ఆస్పత్రుల ఖాతాల్లో జమ అవుతుంది. ఆన్‌లైన్ ‘క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్’ నిబంధనలతో పాటు ఈ ఆభా అనుసంధానం కూడా తోడైతే ఉమ్మడి జిల్లా ప్రైవేటు వైద్య సేవల్లో పారదర్శకత పెరిగి, సామాన్య ప్రజలకు మెరుగైన డిజిటల్ వైద్య సేవలు అందుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Meenakshi Natarajan Nomination | ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారం మొత్తం ఇచ్చా : మీనాక్షి నటరాజన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *