Adilabad Honour Killing | పరువు కోసం కూతురి ప్రాణం తీసిన తండ్రి..

నిశ్చితార్థానికి మరో రెండు రోజులు ఉందనగా ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Adilabad Honour Killing | నిశ్చితార్థానికి మరో రెండు రోజులు ఉందనగా ఆదిలాబాద్  ( Adilabad ) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ పరువు పోతుందనే భావనతో కూతురి ప్రేమ వ్యవహారాన్ని జీర్ణించుకోలేక తండ్రి కన్నకూతురినే హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల విచారణలో బయటపడింది. నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్, సుమిత్ర దంపతుల 18 ఏళ్ల కుమార్తె కళ్యాణికి ఇటీవలే పెళ్లి సంబంధం ఖాయం చేశారు. ఈ నెల 25న నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, ఈ నెల 23న కళ్యాణి ప్రవర్తనలో మార్పును గమనించిన తండ్రి ప్రశ్నించారు.

Adilabad Honour Killing | విషయం బయటపడటంతో ఆగ్రహం..

ఈ నెల 23న ఉదయం తల్లిదండ్రులతో పాటు కళ్యాణి, మరో బాలుడు పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లారు. కడుపునొప్పిగా ఉందంటూ కళ్యాణి కొద్దిసేపటికే ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆమెను నిలదీయగా, తనకు మేనత్త కుమారుడితో ప్రేమ సంబంధం ఉందని కళ్యాణి చెప్పింది. దీంతో కైలాస్ తీవ్ర ఆగ్రహానికి గురై, పరువు పోతుందనే కక్షతో కూతురిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Adilabad Honour Killing | ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..

మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అందరూ నిద్రిస్తున్న వేళ కళ్యాణి గదిలోకి వెళ్లిన కైలాస్, ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకు ప్రయత్నించాడు.

Adilabad Honour Killing | హడావుడిగా అంత్యక్రియలు..

ఉదయం 5 గంటలకు నిద్రలేచిన తల్లి కూతురు వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ, మరణించిన కొద్ది గంటల్లోనే హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం అనుమానాలకు దారితీసింది. పెళ్లికాని యువతి అంత్యక్రియల తీరుపై గ్రామంలో చర్చ జరగడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Adilabad Honour Killing | విచారణలో నేరం అంగీకారం..

కైలాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. మేనత్త కుమారుడితో కూతురి ప్రేమ సంబంధం కారణంగా కుటుంబ పరువు పోతుందనే భయంతో తానే గొంతు నులిమి చంపినట్లు కైలాస్ అంగీకరించినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Hyderabad Police | వివాహ ఊరేగింపులో కత్తులతో విన్యాసం.. నలుగురి అరెస్ట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *