Anak Krakatoa Eruption | ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 50 వేల అడుగుల ఎత్తులో బూడిద మేఘాలు

ఇండోనేషియాలోని ప్రసిద్ధ అనాక్ క్రాకటోవా (Anak Krakatoa) అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా బద్దలైంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Anak Krakatoa Eruption | ఇండోనేషియాలోని ప్రసిద్ధ అనాక్ క్రాకటోవా (Anak Krakatoa) అగ్నిపర్వతం ఆదివారం తెల్లవారుజామున భారీగా బద్దలైంది. ఈ విస్ఫోటనం కారణంగా వెలువడిన దట్టమైన బూడిద పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాలను కమ్మేసింది. ముఖ్యంగా జకార్తాలోని సుకర్ణో – హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన వల్ల మొత్తం 209 విమానాలు ప్రభావితం కాగా, సుమారు 22,800 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Anak Krakatoa Eruption | బూడిద మేఘాలు..

జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఈ అగ్నిపర్వతం ఉంది. ఆదివారం ఉదయం 3:53 గంటల ప్రాంతంలో సుమారు 30 సెకన్ల పాటు ఈ విస్ఫోటనం సంభవించింది. దీనివల్ల రెండు భారీ బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. ఒక మేఘం సుమారు 20 వేల అడుగుల ఎత్తుకు ఎగసి ఈశాన్య దిశగా కదలగా.. మరొక మేఘం ఏకంగా 50 వేల అడుగుల ఎత్తుకు చేరి బాంటెన్, లాంపంగ్, సుమత్రా పశ్చిమాన ఉన్న హిందూ మహాసముద్రం వైపు విస్తరించింది.

Anak Krakatoa Eruption | నిలిచిపోయిన రాకపోకలు..

బూడిద ప్రభావం ఎక్కువగా ఉండటంతో సుకర్ణో-హట్టా విమానాశ్రయంలో తొలుత ఉదయం 5:30 గంటల వరకు విమానాలను నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆంక్షలను ఉదయం 9:30 గంటల వరకు పొడిగించారు. ఎయిర్‌పోర్టులో రాత్రి పార్క్ చేసిన 170 విమానాలు అక్కడే ఆగిపోయాయి. ప్రయాణికులు తమ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరడంతో పాటు చెక్-ఇన్ చేసిన లగేజీని కూడా వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా హాంకాంగ్, సిడ్నీ, సియోల్, దోహా, కౌలాలంపూర్, ఆమ్‌స్టర్‌డామ్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అంతర్జాతీయ విమానాలతో పాటు బాలి, లాంపంగ్, సురబయ వెళ్లే దేశీయ విమానాలు కూడా రద్దయ్యాయి, ఆలస్యంగా నడిచాయి.

Anak Krakatoa Eruption | అప్రమత్తమైన అధికారులు..

ఈ విస్ఫోటనం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఆదేశాలు కూడా ఇవ్వలేదని అధికారులు తెలిపారు. అయితే, అగ్నిపర్వత క్రేటర్‌కు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని పర్యాటకులకు స్పష్టం చేశారు. బూడిద పడే ప్రాంతాల ప్రజలు మాస్కులు ధరించాలని, బయటకు వెళ్లడం తగ్గించాలని, నీటి వనరులను సురక్షితంగా మూసి ఉంచాలని సూచించారు. 2018లో ఇదే అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు సంభవించిన సునామీలో 430 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

 

ఇది కూడా చదవండి:  Liquor Deaths | మధ్యప్రదేశ్​లో దారుణం.. మద్యం తాగి 12 మంది మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *