అక్షరటుడే వెబ్‌డెస్క్: Ananta Chaturdashi 2026 | హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినమైన అనంత చతుర్దశిని సెప్టెంబర్ 25, 2026 (శుక్రవారం) జరుపుకోనున్నారు. ఈ సంవతకసరం ఒకే రోజు రెండు పర్వదినాలు కలిసి రావడం విశేషం. ఒకవైపు భక్తులు శ్రీమహావిష్ణువును ( Vishnu ) అనంత దేవుడిగా కొలుస్తూ అనంత వ్రతాన్ని ఆచరిస్తుండగా.. మరోవైపు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన గణేశోత్సవాలకు తెరదించుతూ గణపతి బప్పాకు వీడ్కోలు పలుకుతారు.
చతుర్దశి తిథి సెప్టెంబర్ 24 రాత్రి 11:18 గంటలకు మొదలై, సెప్టెంబర్ 25 రాత్రి 11:06 గంటల వరకు ఉంటుంది. ఈ కారణంగా సెప్టెంబర్ 25నే పండుగ నిర్వహించుకోవాలని పంచాంగ కర్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి పూజా సమయాల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉన్నందున స్థానిక పంచాంగాన్ని పరిశీలించడం మంచిది.
Ananta Chaturdashi 2026 | పూజా విధానం..
ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు అనంత రూపాన్ని స్మరిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతంలో ‘అనంత సూత్రం’ చాలా కీలకం. ఈ దారానికి 14 ముడులు వేస్తారు. ఇవి పద్నాలుగు లోకాలకు ప్రతీకగా చెబుతారు. సుశీల, కౌండిన్యుల పురాణ కథను పారాయణం చేసి, కుటుంబ సభ్యులతో కలిసి అనంత సూత్రాన్ని ధరిస్తారు. విశ్వాసం, భక్తి, ధర్మ మార్గంలో నడవాలనే సందేశాన్ని ఈ వ్రతం అందిస్తుంది.
Ananta Chaturdashi 2026 | గణేష్ విసర్జన్ ..
పది రోజుల గణేశోత్సవాల ముగింపు సందర్భంగా సెప్టెంబర్ 25న గణేష్ విసర్జన్ నిర్వహిస్తారు. అయితే అందరూ పది రోజులే కాకుండా, తమ కుటుంబ ఆచారాల ప్రకారం ఒకటిన్నర, మూడు, ఐదు, ఏడు రోజుల్లో కూడా నిమజ్జనం చేస్తుంటారు.
Ananta Chaturdashi 2026 | నిమజ్జన వేళ వీడ్కోలు..
గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే ముందు భక్తులు భక్తిశ్రద్ధలతో చివరి పూజ, హారతి నిర్వహిస్తారు. పూజలో తెలిసీ తెలియక జరిగిన పొరపాట్లకు స్వామివారిని క్షమాపణ కోరుకుంటారు. పూలు, దూర్వా, నైవేద్యాలు సమర్పించి “గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు తమ ప్రియమైన దైవానికి వీడ్కోలు పలుకుతారు. విష్ణుమూర్తి అనంత రూపాన్ని స్మరించుకునే ఈ పవిత్ర దినం, గణపతికి ప్రేమతో వీడ్కోలు పలికే ఘడియలు భక్తులకు చిరస్మరణీయంగా నిలుస్తాయి.
ఇది కూడా చదవండి: DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇంట్లో నోట్ల కట్టలు