అక్షరటుడే, పెద్ద కొడప్గల్ : Anganwadi Safety Issues | అంగన్వాడీలు అధ్వానంగా మారుతున్నాయి. పర్యవేక్షణ లేక ఆయా కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో చిన్నారులు అవస్థలు పడుతున్నారు. పెద్దకొడప్గల్ (Peddakodapgal) మండలంలో ఓ అంగన్వాడీని ఇంట్లోని యూరియా బస్తాలు ఉన్న గదిలో నిర్వహిస్తుండడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది.
Anganwadi Safety Issues | ప్రమాదకరంగా అంగన్వాడీలు..
మండలంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాలు లేని చోట అద్దె భవనాల్లో వాటిని నిర్వహించాల్సి ఉండగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లలోనే కొనసాగిస్తుడడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. దీంతో చిన్నారుల భద్రత, పరిశుభ్రత, పౌష్టికాహార పంపిణీపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని మాన్సారం తండాలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే పౌష్టికాహార పదార్థాలను వ్యవసాయానికి ఉపయోగించే యూరియా బస్తాలతో పాటు ఒకేచోట నిల్వ ఉంచుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
Anganwadi Safety Issues | ఉన్నతాధికారులకు తెలిసినా..?
అంగన్వాడీ కేంద్రంలోనే యూరియా బస్తాలు, ఆహార పదార్థాలను ఒకేచోట ఉంచడం వల్ల చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అంగన్వాడీ టీచర్ను ప్రశ్నించగా.. ‘ఈ విషయం అంగన్వాడీ సూపర్వైజ సూపర్వైజర్కు, ఎంపీడీవోకు తెలుసు’ అని టీచరు సమాధానం ఇవ్వడంపై గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే మండల స్థాయి అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
Anganwadi Safety Issues | టీచర్లు రాకపోవడంతో..
మండలంలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు సమయానికి హాజరు కావడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. కేంద్రాల్లో ఉదయం 10 గంటలైనా టీచర్లు రాక ఆయమ్మలు మాత్రమే అన్నీ చూసుకుంటున్నారు.. టీచర్లు సమయానికి రాకపోవడంతో చిన్నారులు సైతం ఎక్కువ సంఖ్యలో రావట్లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొన్నిచోట్ల కేంద్రాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడంతో కుక్కలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Anganwadi Safety Issues | ఉన్నతాధికారులు వస్తేనే..
మండలంలో గత వారం రోజుల క్రితం బురుగుపల్లి గ్రామానికి కలెక్టర్ సందర్శనకు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న సూపర్ వైజర్, సీడీపీవో అప్రమత్తమై కేంద్రాలను హడావుడిగా తనిఖీలు చేపట్టి సిబ్బందికి సలహాలు సూచనలు చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. జిల్లాస్థాయి అధికారులు వస్తేనే తనిఖీలు చేస్తారే తప్ప మిగిలిన సమయాల్లో అంగన్వాడీలను పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు అంగన్వాడీ కేంద్రాలపై నిఘా పెంచి సక్రమంగా సమయ పాలన పాటించే విధంగా కృషిచేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: SIR Review Bheemgal | ఎస్ఐఆర్లో వెనకబడ్డ భీమ్గల్.. పరిస్థితిని సమీక్షించిన నగేష్ రెడ్డి