Anita Chowdhury Cyber Fraud | టాలీవుడ్ నటి అనితా చౌదరికి సైబర్ టోకరా.. ఏకంగా రూ. 4.14 లక్షలు స్వాహా..!

సైబర్ నేరగాళ్ల వలలో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా చిక్కుకుపోతున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Anita Chowdhury Cyber Fraud | సైబర్ నేరగాళ్ల వలలో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా చిక్కుకుపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనితా చౌదరి సైబర్ కేటుగాళ్ల మోసానికి బలయ్యారు. అమెరికా ప్రయాణం కోసం ఆన్‌లైన్‌లో విమాన టికెట్లు బుక్ చేసుకునే క్రమంలో మోసపోయి ఏకంగా రూ. 4.14 లక్షలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Anita Chowdhury Cyber Fraud | బర్త్ డే వేడుకల కోసం ప్రయాణం..

హైదరాబాద్‌లోని  ( Hyderabad )మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివసించే నటి అనితా చౌదరి.. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాకపోకలకు సంబంధించి బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 12న ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెన్సీ కోసం వెతుకుతుండగా ‘లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ పేరుతో ఒక సంస్థ కనిపించింది. అందులోని నంబర్‌కు ఫోన్ చేయగా.. రాజేష్ అనే వ్యక్తి మాట్లాడి, వాషింగ్టన్ డీసీ ప్రయాణానికి బిజినెస్ క్లాస్ టికెట్ల ధర రూ.4,14,180 అవుతుందని నమ్మబలికాడు.

Anita Chowdhury Cyber Fraud | ఖాళీ అయిన ఖాతా..

టికెట్ల బుకింగ్ ప్రక్రియలో భాగంగా డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీలు కావాలని రాజేష్ కోరాడు. బుకింగ్‌లో భాగంగానే ఇవి అడుగుతున్నాడని నమ్మిన అనితా చౌదరి.. అతడు అడిగిన వివరాలతో పాటు ఫోన్‌కు వచ్చిన ఓటీపీలను కూడా చెప్పారు. కొద్దిసేపటికి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.4,14,180 కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే డబ్బులు డెబిట్ అయినప్పటికీ టికెట్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను, ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Anita Chowdhury Cyber Fraud | తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎప్పుడైనా సరే అధికారిక, నమ్మకమైన వెబ్‌సైట్లు లేదా ట్రావెల్ యాప్‌ల ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి. ఫోన్ కాల్స్‌లో అపరిచితులకు డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు, సీవీవీ (CVV) నంబర్లు అసలు చెప్పకూడదు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ (OTP), యూపీఐ పిన్ వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించడంతో పాటు 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.

ఇది కూడా చదవండి:  Electoral Awareness | విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *