అక్షరటుడే వెబ్‌డెస్క్: Kalyana Lakshmi Schemes | తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల అమలుపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పథకాల అమలుపై సింగిల్ బెంచ్ గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు ( High Court)డివిజన్ బెంచ్ ఎత్తివేసింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టింది.
Kalyana Lakshmi Schemes | ఆర్థిక సాయం..
పేద కుటుంబాల యువతుల వివాహాలకు ఈ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే, ఈ పథకాల అమలుకు సంబంధించిన కొన్ని జీవోలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సింగిల్ బెంచ్ గతంలో మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో పథకాల అమలుపై అనిశ్చితి నెలకొనగా, ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
Kalyana Lakshmi Schemes | ప్రభుత్వం తరఫున వాదనలు..
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. ఈ పథకాలు పేద యువతులకు సామాజికంగా, ఆర్థికంగా ఎంతో తోడ్పడుతున్నాయని తెలిపారు. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల వల్ల వేలాది మంది లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌కు ప్రజా ప్రయోజనం లేదని, దాన్ని కొట్టివేయాలని కోరారు. విచారణ సందర్భంగా, ఈ పథకాలపై కాగ్ (CAG) నివేదికలో ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కాగ్ నివేదికలో ఎలాంటి అంశం లేనప్పుడు అమలును ఎందుకు నిలిపివేయాలని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: Subhash Chandra Insolvency | జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు షాక్..