Subhash Chandra Insolvency | జీ మీడియా అధినేత సుభాష్​ చంద్రకు షాక్​..

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు షాక్​ తగిలింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Subhash Chandra Insolvency | జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు షాక్​ తగిలింది. తాను అంగీకరించిన రూ.22 వేల కోట్ల క్లెయిమ్‌లకు గాను రూ. 6.25 కోట్లు చెల్లించి తన వ్యక్తిగత దివాలా ప్రక్రియను పరిష్కరించుకోవడానికి అనుమతిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వును జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నిలిపివేసింది.

సుభాష్​ చంద్రకు రూ.22 వేల కోట్లకు బదులుగా.. రూ.6.25 కోట్లు చెల్లించేందుకు గతంలో ఎన్​సీఎల్​టీ (NCLT) అనుమతి ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. సామాన్యులు రూ.లక్ష రుణం కోసం ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ధనవంతులకు మాత్రం రూ.వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారని ప్రజలు విమర్శించారు. అంతేగాకుండా రుణాలు ఇచ్చిన బ్యాంకులు సైతం దీనిపై అప్పీల్​ చేశాయి. ఈ క్రమంలో మంగళవారం ఎన్‌సీఎల్‌టీ ఐదుగురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం, ఆగస్టు 25 నాటి ఉత్తర్వు అమలుపై స్టే విధించింది. అంతేకాకుండా, హామీదారు హోదాలో ఉన్న చంద్ర, తన ఆస్తులలో దేనినీ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బదిలీ చేయరాదని ఆదేశించింది. అన్ని పక్షాలకు నోటీసులు జారీ చేసి, ఈ విషయాన్ని కొత్తగా విచారించాలని నిర్ణయించింది.

Subhash Chandra Insolvency | ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు

ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు ఈ విషయాన్ని తొలుత ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించగా, చంద్ర రుణ చెల్లింపు ప్రణాళికపై ఆ ధర్మాసనంలోని సభ్యులు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. ఒక సభ్యుడు, ఈ ప్రణాళికకు మద్దతు ఇచ్చిన రుణదాతలకు మాత్రమే దానిని ఆమోదించాలని, అదే సమయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సహా వ్యతిరేకించిన రుణదాతలు వసూలు కోసం స్వతంత్ర పరిష్కార మార్గాలను అనుసరించడానికి అనుమతించాలని మొగ్గు చూపారు. ఆగస్టు 25న, మూడవ సభ్యుడు తిరిగి చెల్లింపు ప్రణాళికను ఆమోదించాలని తీర్పు ఇచ్చారు. ఆగస్టు 31న ధర్మాసనం మూడు అభిప్రాయాల నుండి వాస్తవానికి ఏ మెజారిటీ అభిప్రాయం వెలువడలేదని నిర్ధారించింది. ఈ మూడు భిన్నమైన అభిప్రాయాల కారణంగా, ఈ వ్యవహారం NCLT అధ్యక్షుడికి చేరింది. ఆయన ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది.

Subhash Chandra Insolvency | అసలు ఏం జరిగిందంటే..

‘ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్’ సంస్థ చంద్రపై దివాలా ప్రక్రియను ప్రారంభించింది. ఈ రుణ చెల్లింపు ప్రణాళికలో భాగంగా, ఆమోదించబడిన రూ. 22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు బదులుగా రుణదాతలకు రూ. 6.25 కోట్లు చెల్లించాలని సుభాష్​ చంద్ర ప్రతిపాదించారు. ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ప్రణాళిక అమలైతే రుణదాతలకు తమకు రావాల్సిన మొత్తంలో చాలా తక్కువ మాత్రమే దక్కేది. తాను వ్యక్తిగతంగా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుండి రూ. 22,000 కోట్లు అప్పు తీసుకోలేదని చంద్ర గతంలోనే స్పష్టం చేశారు. ‘ఎస్సెల్ గ్రూప్’తో అనుబంధం ఉన్న కంపెనీలు తీసుకున్న రుణాలకు తాను ఇచ్చిన వ్యక్తిగత హామీలకు సంబంధించినదే ఈ మొత్తమని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: PM Modi on Terrorism | ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *