Land Registrations | తహశీల్దార్​పై వేటు సరే.. ఆ ఆపరేటర్​పై చర్యలేవి..!

నందిపేట మండలంలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్​ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్​పై సస్పెన్షన్​ వేటు వేశారు. అయితే గతంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్న ఆపరేటర్​పై మాత్రం చర్యలు తీసుకోలేదు.

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ : Land Registrations | నందిపేట మండలంలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్​ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.  అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్​ సంతోష్​ రెడ్డిపై ఇప్పటికే సస్పెన్షన్​ వేటు వేశారు. అలాగే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. కాగా.. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో నందిపేట తహశీల్దార్​ కార్యాలయంలో గతంలో పనిచేసిన ఓ ఆపరేటర్​ పాత్ర ప్రధానంగా ఉందని సమాచారం. కేవలం ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి అయిన సదరు ఆపరేటర్​ ప్రస్తుతం రూ. కోట్లలో ఆస్తులు కూడగట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Land Registrations | దొడ్డిదారిలో ఇతరుల పేరిట బదిలీ

ప్రభుత్వ, అసైన్డ్​ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది వాటిని దొడ్డిదారిలో ఇతరుల పేరిట బదిలీ చేస్తున్నారు. ఈ విషయమై నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అక్రమాలకు పాల్పడేవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. కాగా.. నందిపేట మండలంలో పనిచేస్తున్న సంతోష్​ రెడ్డిపై ఆది నుంచి ఆరోపణలు రావడం, అసైన్డ్​ భూములను అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్​ చేసి పెట్టడం వంటి అంశాలపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విచారణ జరిపించిన కలెక్టర్​ ఆయనను సత్వరం విధుల నుంచి తొలగిస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు.

Land Registrations | ఆపరేటర్​ కీలక పాత్ర

నందిపేట మండలంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చినప్పటికీ.. గత ఐదారేళ్లుగా ఈ మండలంలో పనిచేసిన భూ భారతి (గతంలో ధరణి) ఆపరేటర్​ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సంతోష్​ రెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం పక్కన పెడితే గతంలో జరిగిన లావాదేవీలన్నీ కూడా సదరు ఆపరేటర్​ కనుసన్నల్లోనే పూర్తయినట్లు సమాచారం. ఇతర సిబ్బంది ఎవరికీ తెలియకుండా అప్పటి తహశీల్దార్లు, సదరు ఆపరేటర్​ అక్రమ రిజిస్ట్రేషన్లు జరిపినట్లు ఆరోపణలున్నాయి. సంతోష్​రెడ్డికి ముందుకు పనిచేసిన ఓ తహశీల్దార్​ సైతం ఇలాంటి ఆరోపణలే మూట గట్టుకున్నారు. అలాగే గతంలో పనిచేసిన మరో తహశీల్దార్​కు సైతం షోకాజ్​ నోటీసులు జారీ అయ్యాయి. కానీ, సదరు ఆపరేటర్​పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా.. ఈ మధ్యనే పొరుగున ఉన్న మండలానికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. సంతోష్​ రెడ్డి వ్యవహారంలో విచారణ జరుపుతున్న అధికారులు సదరు ఆపరేటర్​, అప్పటి అధికారుల వ్యవహారంలోనూ లోతుగా వివరాలు ఆరా తీస్తే మరిన్ని భూ అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని సొంత కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *