Anti Paper Leak Bill | లోక్​సభ ముందుకు.. యాంటీ పేపర్​ లీక్​ సవరణ బిల్లు

యాంటీ పేపర్​ లీక్​ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశ పెట్టింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anti Paper Leak Bill | నీట్​ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా యాంటీ పేపర్​ లీక్​ సవరణ బిల్లును లోక్​సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుకు ఇటీవల మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. పరీక్షా పత్రాల లీకేజీ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా రెండేళ్ల క్రితం నాటి చట్టాన్ని సవరించే బిల్లును సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ సభలో ప్రవేశ పెట్టారు.

‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026’ను కేంద్ర మంత్రి సభలో ప్రవేశ పెట్టారు. అనంతరం ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభను స్పీకర్ వాయిదా వేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Minister Kiren Rijiju) మాట్లాడుతూ.. చర్చలో పాల్గొనాలని విపక్షాలను కోరారు. ఈ రోజు, పరీక్షా పత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా ఒక పటిష్టమైన బిల్లును తీసుకువస్తున్నామని తెలిపారు. చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలని కోరారు. ఈ బిల్లు కేవలం జరిమానా మాత్రమే విధిస్తుందని, లీకేజీలను నివారించదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అభిప్రాయపడ్డారు.

Anti Paper Leak Bill | యువ ఎంపీలతో…

దేశంలోని ‘జెన్-జెడ్’ మనోభావాలను తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహంలో భాగంగా ఈ బిల్లుపై మాట్లాడటానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి యువ ఎంపీలను రంగంలోకి దించనుందని సమాచారం. మాట్లాడే వారిలో బీజేపీకి చెందిన బన్సూరి స్వరాజ్, తేజస్వి సూర్య, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సాయోని ఘోష్, మితాలి బాగ్, టీడీపీకి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఉండే అవకాశం ఉందని సమాచారం.

Anti Paper Leak Bill | 10 గంటల పాటు

ఈ బిల్లుపై 8 నుండి 10 గంటల పాటు చర్చించనున్నట్లు తెలిసింది. విద్యా శాఖకు సంబంధించిన ప్రశ్నలను అడగడానికి కూడా ఈ రోజు షెడ్యూల్ రూపొందించారు. దేశ నూతన విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సంబంధిత అధికారులు ఇప్పటికే పూర్తి వివరాలు అందించారు.’పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం’ 2024లో అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపాదించిన సవరణలు ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తాయి. ప్రశ్నపత్రాలను లీక్ చేసినందుకు కఠినమైన శిక్ష విధించడమే కాకుండా, వేగవంతమైన విచారణల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం, అటువంటి కేసులను రెండు నెలల్లోగా పరిష్కరించడం వంటి నిబంధనలను ఈ బిల్లులో పొందుపర్చారు. పరీక్షలలో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు, రూ. 50 లక్షల వరకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. సంఘటిత నేరాలకు పాల్పడిన వారికి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.

ఇది కూడా చదవండి..: E20 Janata Party | ఈ 20 జనతా పార్టీ ఏర్పాటు.. గడ్కరీ రాజీనామా చేయాలని డిమాండ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *