SRSP Dam Safety | మృత్యుసాగరం ఎస్సారెస్పీ.. నిఘా కరువుతో నిండు ప్రాణాలు బలి

ఉత్తర తెలంగాణకు వర ప్రదాయని అయిన శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​ వద్ద భద్రత లేదు. దీంతో పర్యాటకులు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : SRSP Dam Safety | ఓ కంచె లేదు.. కాపాలా లేదు.. కాలు పెడితే జలసమాధి అవుతామని తెలుసు. అయినప్పటికీ ఎస్సారెస్పీలో పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఆదివారం ప్రాజెక్ట్​ బ్యాక్​వాటర్​లోని గుంతల్లో మునిగి నలుగురు మృతి చెందడంతో విషాదం నెలకొంది.

SRSP Dam Safety | అసాంఘికా కార్యకలాపాలకు..

ఉత్తర తెలంగాణ (Telangana)కు అన్నపూర్ణ అని పిలిచే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యాం ప్రస్తుతం అసురక్షిత ప్రదేశంగా మారింది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన ఈ ప్రాంతం.. అధికారుల నిర్లక్ష్యం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతినిత్యం వందల కొద్దిమంది డ్యాం పైకి వస్తుంటారు. డ్యాంపై అటు పోలీసులు కానీ ఇటు డ్యాం అధికారుల నిఘా లేకపోవడంతో మద్యం సిట్టింగులు, ప్రేమికులకు, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఆదివారం బ్యాక్ వాటర్‌లో స్నానానికి దిగి నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన.

SRSP Dam Safety | సీసీ కెమెరాలు లేవు..

లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే, వేలాది మంది సందర్శకులు వచ్చే శ్రీరాంసాగర్ (Sri Ram Sagar)డ్యాం పై భద్రత పూర్తిగా గాలిలో దీపంలా మారింది. డ్యాంపై, బ్యాక్ వాటర్ ఏరియా, వ్యూ పాయింట్ల వద్ద ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. 24 గంటలు ఉండాల్సిన పోలీస్ బృందంలో ఒక్కరూ కనిపించరు. రాత్రి 7 గంటల తర్వాత డ్యాం మొత్తం అంధకారమే. ‘లోతు ఎక్కువ.. స్నానాలు నిషేధం’ అనే ఒక్క బోర్డు కూడా కనిపించదు. ఫలితంగా డ్యాం చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాలు, నిర్మానుష్యంగా ఉండే రోడ్లు మద్యం సేవించడం, జంటలు కలవడం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారాయి.

SRSP Dam Safety | బాల్కొండ మూడుగా విడిపోయి..

శ్రీరాంసాగర్ బాల్కొండ మండల కేంద్రంలో ఉన్నప్పుడు ప్రతినిత్యం బాల్కొండ పోలీసులు ముప్కాల్ మీదుగా డ్యాం పైకి వచ్చి పికెట్​ నిర్వహించేవారు. అటు తర్వాత మండలం బాల్కొండ, ముప్కాల్, మెండోరాగా విడిపోవడంతో డ్యాం ముందు భాగం మెండోరాకు, మధ్యభాగం ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధికి, వెనక భాగం బాల్కొండ పరిధిలోకి వస్తుంది. దీంతో పికెట్​ ఎవరు నిర్వహించాలనే విషయం అగమ్యగోచరంగా మారింది.

SRSP Dam Safety | విషాదం.. నిర్లక్ష్యానికి నిదర్శనం..

ఆదివారం సెలవు కావడంతో నిజామాబాద్​ నగరంలోని ఆటోనగర్​కు చెందిన నలుగురు, నాందేడ్​ వాసి ఒకరు మొత్తం ఐదుగురు డ్యాంకు వచ్చారు. డ్యాంలోకి దిగి లక్ష్మీ కాలువు రెగ్యులేటరీ వద్ద ఎలాంటి నిఘా లేకపోవడంతో వారు నీటిలోకి దిగారు. అలా ఒకరిని కాపాడబోయి ఒకరు నలుగురు గల్లంతయ్యారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చేసరికే ఆలస్యమైంది. గతేడాది గేట్లు ఎత్తిన సమయంలో నీళ్లలోకి సరదాగా దిగిన యువకుడు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. ఇలా గతంలోనూ అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి.

SRSP Dam Safety | రెస్క్యూ బోటు లేదు..

ఆదివారం జరిగిన ఘటనలో భద్రతా లోపాలతో పాటు సౌకర్యాల లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. నలుగురు గల్లంతైన ఘటనలో వారిని వెతికేందుకు కొద్దిసేపు వరకు గజ ఈతగాళ్లు అందుబాటులో లేరు. వారు వచ్చి ముగ్గురు మృతదేహాలు బయటకు తీసేందుకు గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో నలుగురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ డ్యాం నిర్వహణ నీటి పారుదల శాఖది, భద్రత పోలీస్ శాఖది, పర్యాటక అభివృద్ధి పర్యాటక శాఖది. కానీ మూడు శాఖలు సైతం ఏదైనా ఘటన జరిగినప్పుడు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ తప్పించుకుంటారనే అపవాదు ఉంది. ప్రతిఏడాది వరదలు, ముంపు, ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు మాత్రం కళ్లు మూసుకుని కూర్చుంటున్నారు. డ్యాంనకు వచ్చే ఆదాయంలో ఒక్కశాతం కూడా భద్రత కోసం ఖర్చు చేయడం లేదు.

SRSP Dam Safety | ప్రత్యేక పికెట్​ ఏర్పాటు చేస్తాం..

– జాన్​రెడ్డి, సీఐ, ఆర్మూర్​ రూరల్​

ఎస్సారెస్పీ డ్యాం ఐదు పోలీస్​స్టేషన్ల పరిధిలో ఉంది. గేట్ల ముందు భాగం మెండోరా పీఎస్​, లక్ష్మీ కెనాల్​ నుంచి ముప్కాల్ పీఎస్​ పరిధిలోకి వస్తుంది. అలాగే ఎత్తిపోతల పథకం బాల్కొండ పీఎస్​ లిమిట్స్​లో ఉంది. బ్యాక్​వాటర్​ ప్రాంతమంతా ఆర్మూర్​, నందిపేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోకి వస్తుంది. ఇక డ్యాంకు ముందు భాగంసోన్​(నిర్మల్​) పీఎస్​ పరిధిలోకి వస్తుంది.​ గతంలో డ్యాం పూర్తిగా బాల్కొండ పీఎస్​ పరిధిలోనే ఉండేది. తాజా సంఘటన నేపథ్యంలో డ్యాంపై పోలీస్​ పికెట్​ ఏర్పాటు చేస్తాం.

ఇది కూడా చదవండి..: Jannapalli Sarpanch Fraud | ఆర్డీవో కార్యాలయం ఎదుట యువతి ఆందోళన.. సర్పంచ్​ మోసం చేశాడని ఫిర్యాదు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *