Govt Junior College Facilities | విద్యార్థులున్నా వసతులు శూన్యం.. జూనియర్​ కళాశాలల్లో దీనస్థితి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీలో వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Govt Junior College Facilities | ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. వీటిని చూసి కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు చదువుకునేందుకు కనీస వసతుల్లేక అవస్థల పాలవుతున్నారు.

Govt Junior College Facilities | కామారెడ్డి జిల్లాకేంద్రంలో..

కామారెడ్డి (Kamareddy) 2016 అక్టోబర్ 11న నూతన జిల్లాగా అవతరించింది. జిల్లా ఏర్పడ్డాక పలు ప్రభుత్వ కార్యాలయాలకు కొత్త భవనాలు వచ్చాయి. కానీ జిల్లా కేంద్రంలోని ప్రధాన విద్యాసంస్థల్లో ఒకటైన ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఏళ్ల నాటి పాత భవనాలు, ఇరుకు తరగతి గదులు, విరిగిన బెంచీలు, ఫ్యాన్లు లేని గదులే ఇప్పటికీ ఇక్కడి నిత్య దృశ్యంలా మారాయి. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి కానీ కళాశాల దుస్థితి మాత్రం మారలేదు.

Govt Junior College Facilities | 1,038 మందికి 10 గదులే..!

కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కలిపి 9 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు అడ్మిషన్లు ఒక్కసారిగా పెరిగాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే అత్యధికంగా 1,038 మంది విద్యార్థులు ఈ కళాశాలలో ప్రవేశం పొందారు. కానీ వారికి కేవలం 50 మంది సామర్థ్యం కలిగిన 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక గదిలో దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. ఉన్న గదుల్లోనూ డెస్క్ టేబుల్స్, బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు నేలపైనే కూర్చుని నోట్సు రాసుకుంటున్నారు. కొన్ని కోర్సులకు చెందిన విద్యార్థులకు షిఫ్టుల వారిగా బోధన సాగిస్తున్నారు.

Govt Junior College Facilities | వరండాలోనే క్లాసులు.. చెట్ల నీడనే పాఠాలు

గదులు సరిపోకపోవడంతో కొన్ని సెక్షన్లకు వరండాలో, మరికొన్నింటికి చెట్ల కిందనే తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం వస్తే తరగతులు నిలిచిపోతాయి. ఎండకు, చలికి విద్యార్థులు అల్లాడిపోతున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతులు ఉన్నా ఫర్నిచర్, తరగతి గదులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రహదారి నుంచి కళాశాలకు వచ్చే దారి కూడా మట్టిరోడ్డు ఉండటంతో వర్షం పడితే బురదగా మరి ఇబ్బందులు పడుతున్నారు.

Govt Junior College Facilities | ఫైళ్లకే పరిమితమైన ప్రతిపాదనలు

కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు కొత్త భవనం, అదనపు గదులు, ఫర్నిచర్ కోసం ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం కళాశాలలో మరొక 15-20 అదనపు తరగతి గదులు నిర్మిస్తే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించిన స్థలం కూడా అందుబాటులో ఉండటంతో నిధులు మంజూరు చేయాలని కోరారు. అయితే అవి కాగితాలకే పరిమితమయ్యాయని తెలుస్తోంది.

Govt Junior College Facilities | ప్రజాప్రతినిధుల మౌనం..

జిల్లా ఏర్పడి దాదాపు పదేళ్లు అవుతోంది. ఈలోగా చాలా పథకాలు వచ్చాయి, నిధులు వచ్చాయి. కానీ కళాశాలకు మాత్రం ఎలాంటి నిధులు రాలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు కళాశాల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడున్న నాయకులు కళాశాల అభివృద్ధి విషయంపై ప్రత్యేక దృష్టి సారించడం లేదన్న ఆరోపణలున్నాయి. నాయకులు ప్రత్యేక దృష్టి పెడితే కళాశాలకు కావాల్సిన దాదాపు రూ.2 కోట్ల నిధుల మంజూరు పెద్ద విషయం కాదన్న టాక్ వినిపిస్తోంది. అయితే నాయకులు మనకెందుకు అని పట్టించుకోవడం లేదా..? లేక ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదా అని విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Govt Junior College Facilities | జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా..

ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామంటూ ప్రచారం చేస్తోంది. మరోవైపు జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మారుమూల ప్రాంతాల పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న 1,038 విద్యార్థుల సంఖ్య వచ్చే సంవత్సరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా కొత్త భవనం, తగినన్ని తరగతి గదులు, ఫర్నిచర్ కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Govt Junior College Facilities | ప్రతిపాదనలు పంపాం..

– జయకుమారి, ప్రిన్సిపాల్, జూనియర్ కళాశాల

కళాశాలకు నేను ప్రిన్సిపాల్​గా వచ్చి రెండేళ్లు అవుతుంది. అదనపు తరగతి గదులు, ఫర్నిచర్ కావాలని అధికారులకు ప్రతిపాదనలు పంపించాను. ఒకసారి నేరుగా కమిషనర్​ను కలిసి కోరాను. ప్రతి ఏడాది కళాశాల సమస్యలపై ప్రతిపాదిస్తున్నాం. ఇప్పటికి మంజూరు కావడం లేదు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అదనపు గదులు, ఫర్నిచర్ మంజూరు చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు.

Govt Junior College Facilities | నాయకులు స్పందించాలి

– వినయ్ కుమార్, టీఎన్​వీఎస్​ జిల్లా అధ్యక్షుడు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో అదనపు గదులు, ఫర్నిచర్ లేకపోవడం దారుణం. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే నాయకులు పట్టించుకోకపోవడం సమంజసం కాదు. జూనియర్ కళాశాలలో గతంలో 300 మంది విద్యార్థులు కూడా ఉండేవారు కాదు. ఇప్పుడు ఏకంగా విద్యార్థుల సంఖ్య 1,100 లకు చేరువలో ఉంది. నాయకులు స్పందించి వసతులు కల్పించాలి.

ఇది కూడా చదవండి..: SRSP Dam Safety | మృత్యుసాగరం ఎస్సారెస్పీ.. నిఘా కరువుతో నిండు ప్రాణాలు బలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *