Apollo Hospital Fine | గోల్డెన్​ అవర్​ వృథా.. అపోలో ఆస్పత్రికి రూ.43 లక్షల ఫైన్​

అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.43 లక్షల జరిమానా విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apollo Hospital Fine | అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.43 లక్షల జరిమానా విధించింది. 2013లో పక్షవాతానికి గురైన 53 ఏళ్ల రోగి మరణం విషయంలో జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్ నిర్లక్ష్యం ఉందని కమిషన్​ నిర్ధారించింది. మొత్తం రూ. కోటి నష్టపరిహారం కోరుతూ రోగి భార్య, కుమారుడు, కుమార్తె దాఖలు చేసిన ఫిర్యాదును కమిషన్ పాక్షికంగా అనుమతించింది.

వారాసిగూడలోని తన ఇంట్లో ఎన్. దేవేందర్ రావు అనే వ్యక్తికి 2013 మార్చి 22న పక్షవాతం వచ్చింది. అదే రోజు కుటుంబ సభ్యులు ఆయనను అపోలో సికింద్రాబాద్ (Secunderabad) శాఖకు తరలించారు. అక్కడి సిబ్బంది, న్యూరాలజిస్ట్ అందుబాటులో లేరని చెప్పి, అతడిని జూబ్లీహిల్స్ బ్రాంచ్‌కు పంపారు. స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ అంటారు. ఆ సమయంలో చికిత్స ఉత్తమంగా పనిచేస్తుంది. అయితే రోగికి సరైన చికిత్స అందించడంలో అపోలో ఆ గంటను వృధా చేసిందని కమిషన్ గుర్తించింది. దీంతో వైద్య నిర్లక్ష్యానికి రూ. 40,11,876, ఆస్తి నష్టానికి రూ. లక్ష, రికార్డుల నిర్వహణ లోపానికి రూ. లక్ష, తండ్రి ప్రేమ కోల్పోయినందుకు రూ. లక్ష చొప్పున చెల్లించాలని అపోలను ఆదేశించింది. వ్యాజ్యపు ఖర్చులు అదనం రూ. 25 వేలు ఇవ్వాలని పేర్కొంది.

Apollo Hospital Fine | తప్పుడు సమాచారం

అపోలో యాజమాన్యం తప్పుడు సమాచారం ఇచ్చిందని కమిషన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము సికింద్రాబాద్ అపోలకు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 2 గంటల మధ్య వచ్చామని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఆస్పత్రి వారు మాత్రం మధ్యాహ్నం 3:15కు వచ్చినట్లు చెప్పారు. మానవ హక్కుల కమిషన్‌కు సమర్పించిన రిపోర్టులో మరో సమయం ఇచ్చారు. ఆసుపత్రి బిల్లుల ప్రకారం సికింద్రాబాద్‌లో సాయంత్రం 4 గంటలకల్లా పరీక్షలు జరిగినట్లు కమిషన్​ గుర్తించింది. జూబ్లీహిల్స్‌లోని రికార్డు ప్రకారం రోగి సాయంత్రం 6:42 గంటలకు మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు చూపించారు. కొన్ని నర్సింగ్ నోట్స్‌లో ఆ అడ్మిషన్ సమయానికి ముందే రీడింగ్‌లు నమోదు చేసినట్లు కమిషన్​ గుర్తించింది. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్​ గుర్తించింది.

Apollo Hospital Fine | రికార్డుల నిర్వహణ లోపం

రోజువారీగా రోగికి ఏమి జరిగిందో రికార్డుల నిర్వహణ కూడా సక్రమంగా లేదు. రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి దాదాపు ఏడు నెలల తర్వాత మరణించాడు. పూర్తి కాలానికి సంబంధించిన అసలు రికార్డులను అపోలో సమర్పించలేదు. 2013 మార్చి చివరి నుంచి అక్టోబర్ మధ్య వరకు.. రోగి ఆసుపత్రిలో ఉన్న ఏడు నెలల కాలానికి సంబంధించిన రికార్డులు ఏవీ కమిషన్‌కు లభించలేదు. దీంతో యాజమాన్యానికి రూ. 43 జరిమానా విధించింది.

ఇది కూడా చదవండి..: Harish Rao Salary Cuts | ఉద్యోగుల వేతనాల్లో కోతలు.. ఇదేనా ప్రజా పాలన : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *