అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao Salary Cuts | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 20–25 ఏళ్లుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో మున్సిపల్ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందన్నారు.
ఇన్నేళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో భాగంగా పనిచేస్తున్న ఉద్యోగుల సేవలు, అనుభవాన్ని గుర్తించాల్సింది పోయి.. కొత్త నిబంధనల పేరుతో జీతాలు తగ్గించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం 31 వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో వేతనాల పెంపు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేతనాల్లో కోతలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల పట్ల ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సీఎంను ఆయన ప్రశ్నించారు.
Harish Rao Salary Cuts | ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన అవుతుంది.
ప్రభుత్వం వెంటనే జీవో 1181ను రద్దు చేయాలని, ఉద్యోగుల పూర్వపు హోదాను యథావిధిగా కొనసాగించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. వేతన రక్షణ కల్పించడంతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టుల భర్తీలో అర్హత, సుదీర్ఘ అనుభవం ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం ప్రజా పాలన కాదని, ప్రజా పీడన అన్నారు.
ఇది కూడా చదవండి..: Mock Assembly | తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ