అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayodhya Ram Mandir | అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల దుర్వినియోగం, దొంగతనం ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఉన్నతాధికారులు ఆమోదించారు.
Ayodhya Ram Mandir | సమావేశంలో కీలక నిర్ణయం..
సోమవారం ( జులై 6 ) ఆలయ ప్రాంగణంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ రాజీనామాలను ఆమోదించారు. ఈ వివాదాన్ని ఎవరూ రాజకీయ కోణంలో చూడవద్దని ట్రస్ట్ ఛైర్పర్సన్ నృత్య గోపాల్ దాస్ కోరారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో దోషులకు ఖచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.”
Ayodhya Ram Mandir | SIT విచారణ..
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేసింది. చంపత్ రాయ్ సన్నిహితుడు రామశంకర్ (తిన్ను యాదవ్) కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. నిందితులు ఆలయం నుండి కరెన్సీ నోట్లను తరలిస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాలు బయటపడ్డాయి. వీరి నివాసాల నుండి భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. గత ఐదేళ్ల ఆర్థిక లావాదేవీలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలని సిట్ నిర్ణయించింది.
Ayodhya Ram Mandir | ట్రస్ట్ వాదన..
వివాదాలు వెల్లువెత్తుతున్నప్పటికీ, తమ ఆర్థిక వ్యవస్థలు పారదర్శకంగానే ఉన్నాయని ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ పేర్కొన్నారు. విచారణను తాము పూర్తిగా గౌరవిస్తామని ట్రస్ట్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు కొనసాగుతుండటంతో, అయోధ్యలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: AI Heart Signal | గుండెపోటును ముందే పసిగట్టే ఏఐ.. శాస్త్రవేత్తల కీలక పరిశోధన