అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BRS Committees | ఒకప్పుడు కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గం బీఆర్ఎస్‌కు కంచుకోట. అలాంటి కంచుకోట నేడు కల కోల్పోయింది. సరైన దిశానిర్దేశం చేసే నాయకులు లేక క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. మరోవైపు జిల్లా కమిటీలు లేక క్యాడర్ వెలవెలబోతున్నారు. ఇక్కడ కేసీఆర్ (KCR) పోటీ చేసి ఓడిపోవడం కూడా పార్టీకి తీవ్రనష్టాన్ని మిగిల్చిందన్న టాక్ ఉంది. దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం వచ్చినా.. పట్టించుకునే ముఖ్య నాయకులు లేరని పార్టీ క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Kamareddy BRS Committees | సరైన దిశానిర్దేశం లేక
కామారెడ్డిలో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారిందన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. సరైన దిశానిర్దేశం లేక, జిల్లా కమిటీలు లేక క్యాడర్ వెలవెలబోతోంది. ఇప్పటికే అధిష్ఠానం పిలుపుల కోసం ఎదురు చూస్తూ రెండున్నరేళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం కొత్త నాయకత్వం కోసం క్యాడర్ ఆశగా ఎదురుచూస్తోంది.
Kamareddy BRS Committees | బీఆర్ఎస్ కమిటీలపై దృష్టి పెట్టని అధిష్టానం
ఎన్నికల ఓటమి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కమిటీలన్నీ రద్దయ్యాయి. కామారెడ్డిలోనూ అదే పరిస్థితి. ఇప్పటివరకు కొత్త జిల్లా కమిటీ ప్రకటన లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకే పరిమితమైన వ్యవహారంతో పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పైనుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. మేం ఎవరి దగ్గరకు వెళ్లి మాట్లాడాలి..? అని మండల స్థాయి నేతలు, కిందిస్థాయి క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. గత రెండున్నరేళ్లలో కామారెడ్డి జిల్లాస్థాయి క్యాడర్ మీటింగ్ ఒక్కటీ జరగలేదు. దాంతో ఇక్కడి పరిస్థితులను పట్టించుకోవడం లేదన్న భావన క్యాడర్‌లో బలంగా నాటుకుంది. పదవుల కోసం ఆశపడిన సీనియర్లు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా అయోమయంలో పడ్డారు.
Kamareddy BRS Committees | కలిసొచ్చిన రైతుల అంశం.. పట్టించుకోని నాయకులు
ప్రభుత్వంపై పోరాడేందుకు రైతు సమస్యలు బ్రహ్మాస్త్రంలా ఉన్నాయి. యూరియా కొరత, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వరద కాల్వల నిర్లక్ష్యం అంశాలతో కిందిస్థాయి క్యాడర్ జనాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించినా ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ వారికి అండగా నిలిచే టాప్ లీడర్లు మాత్రం కామారెడ్డి వైపు చూడడం లేదు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే ఉమ్మడి జిల్లా మొత్తాన్ని చుట్టేస్తున్నారు. అయినప్పటికీ నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
కేసీఆర్ ఓటమి తర్వాత..
2023లో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేసి ఓడిపోవడం పార్టీకి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాల్లో కేసీఆర్ రెండో స్థానంలో ఉండటంతో అధిష్టానం కామారెడ్డికి అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న టాక్ ఉంది. ఆ తర్వాత నుంచే ఈ జిల్లాను అధిష్ఠానం పక్కనపెట్టిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి సీనియర్లెవరూ గత రెండున్నరేళ్లలో కామారెడ్డి గడ్డపై అడుగుపెట్టలేదు.
జోష్ నింపాల్సిన తరుణమిదే..
ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. కంచుకోటను తిరిగి దక్కించుకోవాలంటే ముందు క్యాడర్‌లో జోష్ నింపాలి. జిల్లా కమిటీని ప్రకటించి, సీనియర్ నేతల పర్యటనలు పెట్టి, క్యాడర్‌తో ముఖాముఖి మాట్లాడాలి. రైతు సమస్యలను అజెండాగా తీసుకుని బలమైన ఉద్యమం నిర్మించాలి. కామారెడ్డి బీఆర్ఎస్‌కు అవకాశం ఇంకా ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిష్ఠానం ఈ కంచుకోటపై దృష్టి పెడితే, కోల్పోయిన పునాదులు తిరిగి బల పడతాయన్న టాక్ ఉంది. లేకుంటే పునర్నిర్మాణం ఎప్పుడు..? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకదని కూడా ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: #Telangana | ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి