అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay Allegations | కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సిరిసిల్లలో పర్యటించిన ఆయన, అమృత్ 2 స్కీమ్ కింద కార్గిల్ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
Bandi Sanjay Allegations | నిధుల డైవర్షన్‌పై హెచ్చరిక..
గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను, కరెంట్ బిల్లులు , సిబ్బంది జీతాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం దుర్మార్గమని బండి సంజయ్ విమర్శించారు. కేంద్ర నిధులను కేవలం నిర్ణీత అభివృద్ధి పనులకే వాడాలని, ఒకవేళ ఇలాగే నిధులు దారి మళ్లిస్తే కేంద్రానికి లేఖ రాస్తానని, దీనివల్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో కేంద్ర నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమ చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
Bandi Sanjay Allegations | కేంద్రం నిధుల వరద..
గత 12 సంవత్సరాలలో తెలంగాణకు ( Telangana ) కేంద్రం రూ. 13 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సంజయ్ స్పష్టం చేశారు. అమృత్ 1 కింద రూ. 1660 కోట్లు, అమృత్ 2 కింద రూ. 3,429 కోట్లు తెలంగాణకు మంజూరయ్యాయని ఆయన వివరించారు. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ వంటి మున్సిపాలిటీలకు సుమారు రూ. 400 కోట్లు కేటాయించామని చెప్పారు. ఇన్ని నిధులు ఇస్తున్నా, కేంద్రం అన్యాయం చేస్తోందంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
Bandi Sanjay Allegations | కాంట్రాక్టర్లకు వార్నింగ్..
సిరిసిల్ల కార్గిల్ చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, పనులు నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి పనులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఇకపై అలాంటివి జరగకుండా చూస్తామని హెచ్చరించారు.
Bandi Sanjay Allegations | జర్నలిస్టులకు నోటీసులు..
సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై స్పందించని ఫుడ్ ఇన్‌స్పెక్టర్, సమాచారం అడిగిన జర్నలిస్టులకు లీగల్ నోటీసులు పంపుతామని బెదిరించడంపై మంత్రి స్పందించారు. “జర్నలిస్టులకు లీగల్ నోటీసులు రావడం కొత్తేమీ కాదు, అవి వారికి అవార్డులు, రివార్డుల వంటివి” అని హాస్యస్ఫూర్తిగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: BRS Yuva Sangrama Sabha | బీఆర్ఎస్కు షాక్.. యువ సంగ్రామ సదస్సుకు అనుమతి నిరాకరణ