అక్షరటుడే, వెబ్‌డెస్క్: Basara Temple Donation | భక్తి, సేవాభావం కలిసినప్పుడు దేవాలయాల వైభవం మరింత పెరుగుతుందనడానికి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో మరో విశిష్ట ఘట్టం ఆవిష్కృతమైంది.
చదువుల తల్లిగా కోట్లాది మంది భక్తుల ఆరాధనలను అందుకుంటున్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ గర్భగుడి నిర్మాణం కోసం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ దాతలు సునంద్–పద్మప్రియ దంపతులు రూ.31 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
Basara Temple Donation | బాసర దేవస్థానం చరిత్రలోనే అత్యంత..
ఈ మహాదానం బాసర దేవస్థానం చరిత్రలోనే అత్యంత విశేషమైన విరాళాల్లో ఒకటిగా నిలవనుంది. ఆలయ గర్భగుడి నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి.
భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువైన బాసర క్షేత్రం దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులతో ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ముఖ్యంగా అక్షరాభ్యాసం కోసం చిన్నారులను అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చే సంప్రదాయంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
Basara Temple Donation | గర్భగుడి నిర్మాణం పూర్తయితే
ఇలాంటి ఉదార విరాళం ప్రకటించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గర్భగుడి నిర్మాణం పూర్తయితే ఆలయ వైభవం మరింత పెరగడంతో పాటు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. దాతల సేవాభావాన్ని దేవస్థాన అధికారులు, భక్తులు అభినందిస్తూ, అమ్మవారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.