Bastar Development|తుపాకుల మోత నుంచి ప్రగతి బాట.. బస్తర్ భద్రతా శిబిరాల్లో ‘జన్ సువిధా’ కేంద్రం ప్రారంభం

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bastar Development|ఒకప్పుడు తుపాకుల మోతతో భయానకంగా మారిన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం ఇప్పుడు ప్రగతి బాట పడుతోంది. హింసకు నిలయాలుగా ఉన్న భద్రతా శిబిరాలను ప్రజా సేవా కేంద్రాలుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం బస్తర్ పర్యటనలో భాగంగా మారుమూల నెటానార్ గ్రామ భద్రతా శిబిరం నుండి ‘జన్ సువిధా కేంద్రం’ నమూనాను ప్రారంభించారు.

Bastar Development|శిబిరాల స్థానంలో ప్రజా సేవలు..

బస్తర్ ప్రాంతంలోని దాదాపు 200 భద్రతా శిబిరాలలో 70 శిబిరాలను రాబోయే 18 నెలల్లో పూర్తిస్థాయి గిరిజన సంక్షేమ, పరిపాలన కేంద్రాలుగా మార్చనున్నారు. దశాబ్దాలుగా నక్సల్స్ భయంతో రోడ్లు, పాఠశాలలు, రేషన్, వైద్యం, బ్యాంకింగ్ వంటి కనీస సౌకర్యాలకు దూరమైన గ్రామాలకు ఈ కేంద్రాల ద్వారా సేవలు అందుతాయి. ఒకే భవనం నుండి ఆధార్, రేషన్ కార్డులు, వివిధ ధృవీకరణ పత్రాలతో పాటు దాదాపు 371 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తారు.

Bastar Development|ఒలింపిక్స్ తరహా క్రీడలు..

బస్తర్‌లో గుజరాత్ తరహా మోడల్ అమలు చేస్తాం అని అమిత్ షా ప్రకటించారు. జాతీయ పాడి అభివృద్ధి బోర్డు (NDDB) సహకారంతో ఇక్కడ పాడి పరిశ్రమను ప్రవేశపెట్టి, గిరిజన మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పిస్తామన్నారు. అలాగే అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా యువతకు ఉపాధి చూపుతామన్నారు. దీనితో పాటు గిరిజన యువత నైపుణ్యాలను వెలికితీసేందుకు ఒలింపిక్స్ తరహాలో క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని, వారి చేతుల్లో ఆయుధాలకు బదులు ఆట వస్తువులు ఉంచుతామని హామీ ఇచ్చారు.

Bastar Development|బస్తర్‌కు లభించిన నిజమైన స్వేచ్ఛ

“దేశానికి 1947లోనే స్వాతంత్ర్యం వచ్చింది, కానీ నక్సలిజం కోరల నుంచి బస్తర్‌కు ఈ ఏడాది మార్చి 31న నిజమైన స్వేచ్ఛ లభించింది” అని అమిత్ షా అన్నారు. అభివృద్ధి జరగలేదు కాబట్టే ఆయుధాలు పట్టామన్న మావోయిస్టుల వాదన అపోహ మాత్రమేనని, వారు ఆయుధాలతో భయాందోళనలు సృష్టించడం వల్లే ఇన్నాళ్లూ అభివృద్ధి జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు సుమారు 3,000 మంది లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కల్పించిందని తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో నక్సలిజం వల్ల గ్రామాల్లో జరిగిన నష్టాన్ని పూర్తిగా పూడ్చి, మౌలిక వసతులను పునర్నిర్మించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత ముగింపు లభిస్తుందని హోం మంత్రి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | కవిత జైలుకెళ్తే కేసీఆర్ రాజీనామా చేశారా? : రామచందర్ రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *