అక్షరటుడే వెబ్డెస్క్: Bay of Bengal Low Pressure | బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల వేగం ఆధారంగా ఈ అల్పపీడనం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సాధారణ అల్పపీడనంగానే మిగిలిపోతుందా లేదా తుఫానుగా రూపంతరం చెందుతుందా అనేది మరికొన్ని గంటల్లో స్పష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Bay of Bengal Low Pressure | ప్రభావం ఎంత?
ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలపై ( Telangana ) ఏ మేరకు ఉంటుందనే దానిపై ప్రజల్లోనూ, రైతుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వీస్తున్న గాలుల దిశ ప్రకారం ఈ అల్పపీడనం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు ప్రాథమికంగా గుర్తించారు. రాబోయే 24 గంటల కాలం ఈ అల్పపీడన గమనాన్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో అత్యంత కీలకమైనది. ఒకవేళ గాలుల దిశ మారి కోస్తా ఆంధ్ర వైపునకు తిరిగితే, తీరప్రాంత జిల్లాల్లో తీవ్రస్థాయిలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది.
Bay of Bengal Low Pressure | రైతులకు సూచనలు..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీ తీరప్రాంత ప్రజలను, మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆదేశించారు. వరి, ఇతర పంటలు నష్టపోకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. గాలుల దిశపై స్పష్టత వచ్చాక స్థానిక యంత్రాంగాలు మరింత అప్రమత్తం కానున్నాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi Telangana Visit | రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారు..