BC Free Electricity | ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. బీసీ వర్గాలకు ఉచిత విద్యుత్

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: BC Free Electricity | ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సారథ్యంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పేదలు, వెనుకబడిన వర్గాల ఆర్థిక భారం తగ్గించే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.

BC Free Electricity | ఉచిత విద్యుత్ అందించే నిర్ణయం

ఈ క్రమంలో బీసీ వర్గాలకు చెందిన పలు వృత్తిదారులకు ఉచిత విద్యుత్ అందించే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు విద్యుత్ వినియోగ భారం తగ్గించి ఆర్థికంగా కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, బీసీ వర్గాల్లోని రజకులు, స్వర్ణకారులు, నాయీబ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. తమ వృత్తుల నిర్వహణలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే నేపథ్యంలో, ఆ వర్గాలకు మద్దతుగా ప్రభుత్వం ఈ సదుపాయం కల్పిస్తోంది.

వృత్తుల వారీగా ఉచిత విద్యుత్ యూనిట్ల కేటాయింపు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగా:

సెలూన్ షాపులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
లాండ్రీ షాపులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు

ఈ పథకాన్ని పొందాలనుకునే అర్హులైన లబ్ధిదారులు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు:

ఆధార్ కార్డు
రేషన్ కార్డు
కుల ధ్రువీకరణ పత్రం
తాజా విద్యుత్ బిల్లు
ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్

ఈ పత్రాలతో సంబంధిత APSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ (AE) కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

BC Free Electricity | అర్హులైన వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలి

అయితే ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాలకు కొంత మినహాయింపు కూడా కల్పించింది. దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు వంటి మొత్తం 32 ఉప కులాలకు చెందిన లబ్ధిదారులు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల (Current Bills) భారం తగ్గడంతో చిన్న వృత్తిదారులు, వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kakinada Tipper Accident | ఉపాధి పనులకు వెళ్లి మృత్యువాత.. కాకినాడలో టిప్పర్ బీభత్సం, నలుగురు మహిళా కూలీల దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *