Bhopal Pregnant Woman Suicide | విషాదం.. గర్భిణి ఆత్మహత్య.. అత్త రిటైర్డ్ జడ్జి, భర్త లాయర్ అయినా వేధింపులు తప్పలేదా?

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bhopal Pregnant Woman Suicide | చదువుకున్న వారు, సమాజంలో ఉన్నత హోదా కలిగినవారు ఉండే చోట మహిళలకు రక్షణ ఉంటుందని భావిస్తాం. కానీ, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఘటన ఈ నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. వివాహమైన ఏడాదికే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది.

Bhopal Pregnant Woman Suicide | ఏడాది తిరగకముందే ముగిసిన నూరేళ్ల జీవితం

మృతురాలు త్విషకు 2025లో ఘనంగా వివాహమైంది. పెళ్ళికి ముందు వరకు ఉద్యోగం చేస్తూ స్వతంత్రంగా ఉన్న త్విష.. వివాహం తర్వాత తన ఉపాధిని వదులుకుంది. అయితే, వైవాహిక జీవితం ఆమె ఊహించినంత మధురంగా సాగలేదు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త, అత్తమామల నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.

Bhopal Pregnant Woman Suicide | మానసిక క్షోభ.. దారుణమైన ఆరోపణలు

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. త్విషను ఆమె భర్త నిరంతరం కించపరిచేవాడు. ఉద్యోగం వదిలేసినందుకు ఆమెను “పనికిరానిదానివి” అంటూ వేధించేవాడని ప్రధాన ఆరోపణ.

ఈ వేధింపులు కేవలం మాటలకే పరిమితం కాలేదు. గర్భం దాల్చిన త్విష, ప్రస్తుత పరిస్థితుల్లో బిడ్డను కనేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పగా.. అత్తమామలు ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.

అంతిమంగా, భర్త చేసిన ఒక వ్యాఖ్య ఆమెను తీవ్రంగా కలచివేసింది. “ఈ బిడ్డ నాది కాదు..కాబట్టే నువ్వు అబార్షన్ చేయించుకోవాలని చూస్తున్నావు” అంటూ భర్త ఆమె శీలాన్ని శంకించాడని మృతురాలి కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఉన్నత విద్యావంతుడై ఉండి, వృత్తిరీత్యా న్యాయవాది అయిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత హేయమైన చర్యగా విమర్శలు వెలువడుతున్నాయి.

Bhopal Pregnant Woman Suicide | న్యాయం చెప్పే ఇంట్లోనే అన్యాయం?

ఈ కేసులో మరో విచారకరమైన విషయం ఏమిటంటే.. త్విష అత్త ఒక రిటైర్డ్ జడ్జి. చట్టం – న్యాయంపై పూర్తి అవగాహన ఉన్న కుటుంబంలోనూ ఒక మహిళ వేధింపులకు గురై ప్రాణాలు తీసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది.

విద్యావంతులు, హోదా ఉన్న కుటుంబం కావడంతో ఈ వ్యవహారం వెనుక మరేదైనా కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

“నా కూతురు ఉద్యోగం వదిలేసి ఇంట్లో ఉంటే, ఆమెను పనికిరానిదానిగా చూశారు. గర్భం దాల్చిన సమయంలో అండగా ఉండాల్సింది పోయి, భయంకరమైన ఆరోపణలతో ఆమెను మానసిక కుంగుబాటుకు గురిచేశారు.” – మృతురాలి కుటుంబ సభ్యులు.

Bhopal Pregnant Woman Suicide | పోలీసుల దర్యాప్తు

త్విష ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెళ్లయిన ఏడాది లోపే మరణించడంతో ఇది వరకట్న వేధింపుల కోణంలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. త్విష డైరీ, సూసైడ్ నోట్ కోసం గాలిస్తున్నారు.

అన్ని హంగులు, హోదాలు ఉన్నా కూడా ఒక ఆడపిల్ల ఆత్మహత్యకు పాల్పడటం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయాలని త్విష కుటుంబం డిమాండ్ చేస్తోంది.

Khushbu | “నడకే జిమ్‌”… 32 కేజీలు తగ్గి ఆశ్చర్యపరిచిన నటి ఖుష్బూ ఫిట్‌నెస్ ప్రయాణం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *